kumaram bheem asifabad-కుమరం భీం వర్థంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:25 PM
భీం విగ్రహం వద్ద నివాళులర్పించిన కుమరం భీం జిల్లా కలెక్టర్ కె.హరిత
కెరమెరి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం వర్థంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. మండలంలోని జోడెఘాట్‌ను శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ సందర్శించారు. జోడెఘాట్‌లోని మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 26 నిర్వహించనున్న వర్థంతికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తాగునీరు, పారిశుధ్యం, రవాణా, వైద్య, సదుపాయాలు, భధ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కుమరం భీం త్యాగం, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచిచారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన కుమరం భీం, త్యాగం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను సర్మించుకుంటూ ఈ నెల 26న జరిగే వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు పక్కగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ పీవో మందమకరందుతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భూముల రీ సర్వను పకడ్బందీగా నిర్వహించాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం కెరమెరి మండలం నాగాపూర్‌లో చేపడుతున్న భూముల రీ సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్భందీగా చేపట్టాలని, సంబంధిత రైతులకు ముందుగా సమాచారం అందించి ప్రతి రైతు రీ సర్వేలో హాజరయ్యే విధంగా చూడాలన్నారు. రీ సర్వే కోసం రెండు బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సర్వేలో వినియోగించే రోవర్లను తెప్పించటం జరిగిందన్నారు. వీటి ద్వారా ఖచ్చితమైన సర్వేను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటి ఇన్‌స్పెక్టర్ శ్రావణ్, మండల సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.