సీఎం ముఖ్యకార్యదర్శిగా ఎన్.శ్రీధర్
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:26 AM
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అజిత్‌రెడ్డి బదిలీ
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ విభాగం సీఈవోగా నియామకం
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
పీసీసీఎఫ్‌గా వినయ్‌కుమార్‌కు బాధ్యతలు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎన్.శ్రీధర్‌ను బదిలీ చేసి.. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా నియమించింది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న బి.అజిత్‌రెడ్డిని బదిలీ చేసి పరిశ్రమల శాఖలోని ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ విభాగం సీఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల యూనిట్, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు చేనేత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, డైరెక్టర్‌గా, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, టీజీసీవో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వీటితోపాటు సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగాలని ఘోష్‌ను ఆదేశించింది. ఇక దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌కు అడవులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది. అయితే దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అహ్మద్ నదీమ్‌ను బదిలీ చేసి, సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) ముఖ్యకార్యదర్శిగా నియమించింది. మైనారిటీల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
ముగిసిన రాహుల్ బొజ్జా సెలవు..
సెలవు నుంచి వచ్చిన రాహుల్ బొజ్జాను విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావుకు గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక రైతు డిస్కం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ ముషార్రఫ్ అలీ ఫారూఖీకి టీజీరెడ్కో వీసీగా, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కాత్యాయనీదేవిని బదిలీ చేసి, చేనేత శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. టీజీ రెరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.గంగాధర్‌ను బదిలీ చేసి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. కోర్ అర్బన్ రీజియన్ అండ్ మెట్రో రైలు జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ టి.వెంకన్నను బదిలీ చేసి, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఓఎస్‌డీగా ఉన్న కె.విద్యాసాగర్‌ను బదిలీ చేసి, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్ కె.చంద్రకళకు కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రో రైలు జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
పీసీసీఎఫ్‌గా వినయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర అటవీ దళాల అధిపతి(పీసీసీఎ్‌ఫ)గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎ్‌ఫఎస్ అధికారి వినయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పీసీసీఎఫ్ సువర్ణ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండడంతో కొత్త నియామకం చేపట్టింది.