Share News

వైటీపీఎస్‌లో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - May 18 , 2026 | 03:03 AM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని వైటీపీఎ్‌స(యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌)లోని యూనిట్‌-3లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

వైటీపీఎస్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • యూనిట్‌-3లో ఆయిల్‌ లీకేజీతో ఎగసిపడిన మంటలు

  • కార్మికులు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

దామరచర్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని వైటీపీఎ్‌స(యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌)లోని యూనిట్‌-3లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీస్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఇందులో 800 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగిన మొత్తం ఐదు యూని ట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణం పూర్తికావస్తోంది. ఇప్పటికే యూనిట్‌-1, 2, 4లలో విద్యుదుత్పత్తి ప్రా రంభం కాగా యూనిట్‌-3 ప నులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో సీవోడీ(కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌) ప్రక్రియను పూర్తిచేసిన బీహెచ్‌ఈఎల్‌ అధికారులు విద్యుదుత్పత్తికి రంగం సిద్ధం చేశారు. గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు జెన్‌కోకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు యూనిట్‌-3లోని టర్బైన్‌కు నీటి సరఫరా జరిగే ప్రాంతంలో ఆయిల్‌ పైపు లీకవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిశ్రమకు సంబంధించిన ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు చెమటోడ్చారు. గంటలోపు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో సమీపంలోని యంత్రాలు, కేబుల్‌ వైర్లు దగ్ధమై పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దీంతో యూనిట్‌-3ని గ్రిడ్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ నెలకు పైగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. యూనిట్‌-3లో నిత్యం అధిక సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఆదివారం సెలవు దినం కావడం, ఆ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో కార్మికులు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

గతంలోనూ ప్రమాదాలు

వైటీపీఎస్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో యూనిట్‌-1 ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అగ్ని ప్రమాదం సంభవించి భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది.

Updated Date - May 18 , 2026 | 03:03 AM