Share News

పట్టునిలుపుకొన్న మజ్లిస్‌

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:47 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పట్టు నిలుపుకొంది. గత ఎన్నికలతో పోల్చితే కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ.. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, జగిత్యాల మున్సిపాలిటీలలో కింగ్‌ మేకర్‌గా నిలిచింది.

పట్టునిలుపుకొన్న మజ్లిస్‌

  • భైంసా మునిసిపాలిటీ మళ్లీ ఎంఐఎంకే!

  • బోధన్‌లో కాంగ్రెస్‌, మజ్లిస్‌ కూటమికే చాన్స్‌

  • నిజామాబాద్‌, పాలమూరులో కింగ్‌ మేకర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పట్టు నిలుపుకొంది. గత ఎన్నికలతో పోల్చితే కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ.. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, జగిత్యాల మున్సిపాలిటీలలో కింగ్‌ మేకర్‌గా నిలిచింది. భైంసా మున్సిపాలిటీ పీఠానికి దగ్గరైంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా 18 చోట్ల కాంగ్రెస్‌, 14 చోట్ల మజ్లిస్‌ విజయం సాధించాయి. మేయర్‌ సీటును కాంగ్రెస్‌, డిప్యూటీ మేయర్‌ను మజ్లిస్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక 26 వార్డులున్న భైంసాలో 12 చోట్ల మజ్లిస్‌, ఒకచోట కాంగ్రెస్‌ గెలిచాయి. కాంగ్రెస్‌ మద్దతుతో భైంసా మున్సిపాలిటీని మజ్లిస్‌ చేజిక్కించుకునే అవకాశం ఉంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 38 వార్డులకుగాను 17 చోట్ల కాంగ్రెస్‌, 12 చోట్ల మజ్లిస్‌ గెలిచాయి. ఇక్కడ రెండు పార్టీలు కలిసి పీఠాన్ని దక్కించుకోనున్నాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో కాంగ్రె్‌సకు మద్దతిచ్చే అవకాశం ఉన్నందున.. బోధన్‌ చైర్‌పర్సన్‌ పదవిని మజ్లిస్‌ కోరవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌లో 16 చోట్ల మజ్లిస్‌ గెలవగా ఈసారి 2 స్థానాలు తగ్గాయి. ఇక మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 27 స్థానాలు కాంగ్రె్‌సకు, 3 స్థానాలు మజ్లి్‌సకు వచ్చాయి. దీనితో ఇక్కడ కూడా మజ్లిస్‌ కీలకంగా మారింది. 37 స్థానాలున్న జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 2, మజ్లిస్‌ 2, ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు మజ్లిస్‌ కీలకంగా మారింది.. 50 స్థానాలున్న జగిత్యాలలో కాంగ్రెస్‌ 23, మజ్లిస్‌ 3 సీట్లు గెలిచాయి. ఇతరులు 14 చోట్ల విజయం సాధించారు. జగిత్యాలలోనూ మజ్లిస్‌ కీలక భూమిక పోషించనుంది. మరోవైపు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 3, నల్గొండ కార్పొరేషన్‌లో 2 చోట్ల మజ్లిస్‌ గెలిచింది. మున్సిపాలిటీలకు వస్తే.. ఆదిలాబాద్‌లో 6, నిర్మల్‌లో 3, జహీరాబాద్‌, నారాయణపేట్‌, జగిత్యాలలో 2 చొప్పున, సంగారెడ్డి, కాగజ్‌నగర్‌, గద్వాల్‌, కోహిర్‌, కొడంగల్‌, వికారాబాద్‌, ఆర్మూర్‌, తాండూరులలో ఒక్కో సీటు గెలుచుకుంది. మొత్తంగా గత మున్సిపల్‌ ఎన్నికల్లో 87 చోట్ల మజ్లిస్‌ గెలవగా.. ఈసారి 69 స్థానాలు వచ్చాయి.

Updated Date - Feb 14 , 2026 | 03:47 AM