Share News

ఉత్తర తెలంగాణలో మజ్లిస్‌ కీలకం!

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:50 AM

పురపాలక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రధాన రాజకీయపార్టీలతోపాటు మజ్లిస్‌ పార్టీ కూడా క్రియాశీలకంగా మారింది.

ఉత్తర తెలంగాణలో మజ్లిస్‌ కీలకం!

  • నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం

  • కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కలిపి పోటీలో 282 మంది

  • 2020లో 276 స్థానాల్లో పోటీచేసి 110చోట్ల గెలిచిన ఎంఐఎం

కరీంనగర్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఫిబ్రవరి 7: పురపాలక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రధాన రాజకీయపార్టీలతోపాటు మజ్లిస్‌ పార్టీ కూడా క్రియాశీలకంగా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎంఐఎం అత్యధిక ప్రభావాన్ని చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కొన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పాలకవర్గాల ఏర్పాటు మజ్లిస్‌ మద్దతుతోనే జరిగే అవకాశాలున్నాయి. ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మజ్లిస్‌ అభ్యర్థులు పోటీలో నిలిచాయి. ఎంఐఎం ప్రతినిధులిచ్చిన సమాచారం మేరకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కలిపి 282 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా బోధన్‌ మునిసిపాలిటీలో 24 స్థానాల్లో పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 21, నిర్మల్‌లో 19, ఆదిలాబాద్‌లో 19, భైంసాలో 18, మహబూబ్‌నగర్‌లో 16, కరీంనగర్‌లో 15, తాండూరులో 15 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్ల పరంగా చూస్తే కరీంనగర్‌, నిజామాబాద్‌లో మజ్లిస్‌ అభ్యర్థులు క్రియాశీలకంగా మారనున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 16 డివిజన్లు గెలుచుకున్న మజ్లిస్‌ మద్దతుతో బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. అప్పట్లో ఇరుపార్టీలకు రాష్ట్ర స్థాయిలో అవగాహన ఉండగా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పరిస్థితి తలకిందులైంది. గతంలో చూపినంత ప్రభావం ఈ ఎన్నికల్లో చూపే అవకాశంలేదు. కానీ, నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 15-16 డివిజన్లలో ఎంఐఎం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రె్‌సకు అవసరమైతే ఎంఐఎం మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 15 స్థానాల్లో పోటీచేస్తుండగా... ఏడెనిమిది స్థానాల్లో ఎంఐఎం గెలిచే అవకాశాలున్నాయి.


మునిసిపాలిటీలపై మరింత ఫోకస్‌

కార్పొరేషన్లలో పాలకవర్గాల ఏర్పాటులో క్రియాశీలకం కానున్న మజ్లిస్‌ కొన్ని మునిసిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భైంసా మునిసిపాలిటీ గతంలో ఎంఐఎం చేతులో ఉండేది. ఈసారి అక్కడ బీజేపీ గట్టిపోటీ ఇస్తుండగా భైంసా పీఠాన్ని కాపాడుకోవాలనే తలంపుతో ఎంఐఎం పనిచేస్తోంది. 2020 ఎన్నికల్లో 276 వార్డుల్లో పోటీచేసిన మజ్లిస్‌ 110 స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని భైంసా, రంగారెడ్డి జిల్లాలోని జల్‌పల్లి మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈసారి అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న ఎంఐఎం.. నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌లో పాలకవర్గాల ఏర్పాటులో క్రియాశీలకం కానుంది.

Updated Date - Feb 08 , 2026 | 06:50 AM