Share News

మార్కెట్లలో ఇబ్బందిపడుతున్న మక్క రైతులు

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:42 AM

వరంగల్‌ జిల్లా రైతులు మక్కలు అమ్ముకుందామని మార్కెట్‌కు వెళితే మార్క్‌ఫెడ్‌ అధికారులు అనేక కొర్రీలతో ఇబ్బంది పెడుతున్నారు...

మార్కెట్లలో ఇబ్బందిపడుతున్న మక్క రైతులు

  • ఎకరాకు 26 క్వింటాలే కొంటామని అధికారుల మెలిక

  • సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతుల తంటాలు

వరంగల్‌ వ్యవసాయం, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా రైతులు మక్కలు అమ్ముకుందామని మార్కెట్‌కు వెళితే మార్క్‌ఫెడ్‌ అధికారులు అనేక కొర్రీలతో ఇబ్బంది పెడుతున్నారు. ఏనుమాముల మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1700 నుంచి రూ.1800లకు కొనుగోలు చేస్తుండగా మార్క్‌ఫెడ్‌ క్వింటాకు రూ.2400 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రద్దీ పెరిగిపోయి బస్తాలు పేరుకుపోతున్నాయి. మక్కలు అమ్ముకోవాలంటే వారం రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎకరాకు 26 క్వింటాళ్లే కొంటామని అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో మిగిలినవి ఎక్కడ అమ్ముకోవాలని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులకు అమ్మితే క్వింటాకు రూ.600ల నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మక్కల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌ అధికారులు కేవలం 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటిలో సరైన సదుపాయాలు లేక కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. ఎక్కడికక్కడ రైతువేదికల్లోనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు, త్వరిత గతిన మక్కల కొనుగోల్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 21 , 2026 | 04:42 AM