kumaram bheem asifabad- మక్క రైతుకు కష్టాలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:34 PM
ప్రభుత్వం యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని సూచించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా రైతులు ఈ సారి మొక్కజొన్న సాగు చేశారు. పంట తొందరగా చేతికి వస్తుందనే ఆశతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అరుతడి పంటతో పాటు పెట్టుబడి తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా వస్తుందనే ఆశతో సాగు చేయగా, రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కనీసం అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.
బెజ్జూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని సూచించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా రైతులు ఈ సారి మొక్కజొన్న సాగు చేశారు. పంట తొందరగా చేతికి వస్తుందనే ఆశతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అరుతడి పంటతో పాటు పెట్టుబడి తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా వస్తుందనే ఆశతో సాగు చేయగా, రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కనీసం అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2400కాగా, ప్రస్తుతం బయట మార్కెట్‌లో రూ.1600, రూ.1700లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాకు రూ.700వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- జిల్లాలో 15వేల ఎకరాలకు పైగా..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌లో మొక్కజొన్న 15వేలకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయం వచ్చింది. కొన్నిచోట్ల కోతలు కూడా సాగుతున్నాయి. ఈ ఏడాది పంట కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం కాగా ప్రభుత్వ మద్దతు ధర లేక ఆందోళనకు గురవుతున్నారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనబడటం లేదు. ఇప్పటికీ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయట దళారులకు విక్రయించాల్సి వస్తోంది. జిల్లాలో పత్తి తర్వాత మొక్కజొన్న సాగును ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలోని కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, కెరమెరి, జైనూరు, తదితర మండలాల్లో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. గత ఏడాది జిల్లాలో జైనూరులో మాత్రమేఊ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, అయితే కాగజ్‌నగర్ డివిజన్‌లో మాత్రం ఏర్పాటు చేస్తేనే రైతులకు అనుకూలంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
- ఏటేటా పెరుగుతున్న సాగు..
జిల్లాలో మొక్కజొన్న సాగు ఏటేటా పెరుగుతోంది. అరుతడితో పాటు తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి వస్తుండటంతో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి తర్వాత జిల్లాలో సింహబాగం మక్క సాగుదే కావడం గమనార్హం. వాణిజ్య పంట కావడం తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తుండటమే కారణమని రైతులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏటా జిల్లాలో సాగు పెరుగుతూ వస్తోంది. అయితే పంట సాగు బాగానే ఉన్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని కారణంగా మక్క రైతులు ప్రభుత్వ మద్దతు ధర దక్కక నష్టపోతున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం.
- బోర్కూట్ వెంకట్, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి ప్రకటన రాగానే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఈ విషయమై మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడాం. రైతులు ఇబ్బందులు పడకుండా త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.