మక్కలు ప్రైవేట్‌పరం
ABN , Publish Date - May 31 , 2026 | 01:13 AM
మద్దతు ధరకు మొక్కజొన్నలు అమ్ముకునేందుకు ఆదివారం ఆఖరి రోజు. మే నెలాఖరుతో మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ ద్వారా మొక్కజొన్నల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 27 వరకే కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మద్దతు ధరకు మొక్కజొన్నలు అమ్ముకునేందుకు ఆదివారం ఆఖరి రోజు. మే నెలాఖరుతో మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ ద్వారా మొక్కజొన్నల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 27 వరకే కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కేంద్రాల నిర్వహకులు, మార్కెట్ కమిటీ సెక్రటరీలు ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లోనే రాశులుగా మిగిలి ఉన్న మక్కలను తూకం వేసి ఇంకా రైతుల వద్ద ఉన్న వాటిని కూడా కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రకటించడంతో నెలాఖరువరకు కొనుగోళ్లు చేస్తున్నారు. ఈసారి వరితోపాటు మక్కజొన్న దిగుబడి కూడా జిల్లాలో ఆశించిన దానికంటే ఎక్కువేవచ్చింది. దీంతో రైతులు సంతోషించారు. వాటిని పూర్తిస్థాయిలో అమ్ముకోలేక పోతుండడంతో మద్దతు ధర రాకున్నా ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
ఫ ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి
యాసంగి సీజనలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఎకరానికి 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. జిల్లాలో 30,242 ఎకరాల్లో రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. ఎకరాకు 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి లెక్కేసినా 9.07,260 క్వింటాళ్ల దిగుబడి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,44,177 క్వింటాళ్లు మాత్రమే 2,400 రూపాయల మద్దతు ధర చెల్లించి కొన్నారు. చొప్పదండి మార్కెట్ కమిటీలో 49,389, జమ్మికుంట మార్కెట్ కమిటీలో 78,179, గన్నేరువరం కొనుగోలు కేంద్రంలో 32,301, కరీంనగర్ మార్కెట్ కమిటీలో 23,768 చిగురుమామిడి కొనుగోలు కేంద్రంలో 27,175, సైదాపూర్ కొనుగోలు కేంద్రంలో 23,325, మల్లాపూర్ (తిమ్మాపూర్ మండలం)లో 8,037 క్వింటాళ్లు ఖరీదు చేశారు. ఈ కేంద్రాల్లో సుమారు 21 వేల క్వింటాళ్ల మక్కలు ఉన్నాయి. తూకం వేసి తరలించనివి 10 వేల క్వింటాళ్లు ఉన్నాయి. నేటితో కొనుగోళ్ళు పూర్తికానున్నందున కేంద్రాల్లో ఉన్న మక్కలన్నింటిని కొన్నా 2.75 లక్షల క్వింటాళ్లు మాత్రమే అవుతాయి.
ఫ ఆరు లక్షల క్వింటాళ్లు ప్రైవేట్ వ్యాపారులకే..
ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ సంవత్సరం రైతుల వద్ద నుంచి ఎకరాకు 26.5 క్వింటాళ్ల మక్కలను మద్దతు ధర చెల్లించి కొనాల్సి ఉన్నది. ఆ లెక్కన చూసినా ఎనిమిది లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం కొన్న మూడు లక్షల క్వింటాళ్లకు కూడా చేరుకోవడం లేదు. దీంతో రైతులు మరో ఆరు లక్షల క్వింటాళ్లను ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకోవలసిన పరిస్థితి ఉన్నది.
ఫ ఆలస్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో 15 నుంచి 20 రోజులు వేచి చూస్తే తప్ప తూకం వేయకపోవడంతో రైతులు కేంద్రాల్లో పడిగాపులు పడలేక ప్రైవేట్‌లో 1900 రూపాయలకే క్వింటాల్ చొప్పున మక్కలను అమ్ముకున్నారు. ఇప్పటికే రైతులు సుమారు మూడు లక్షల క్వింటాళ్లను ప్రైవేట్‌లో అమ్ముకుని ఉంటారని అంచనా. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో వరి, మక్కల దిగుబడిలో 50 శాతం మాత్రమే కొనాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్రలో కొనుగోలు కేంద్రాలే లేకపోవడంతో అక్కడి రైతులు ప్రైవేట్ వ్యాపారులకే వరి, మక్కలు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. దీంతో ఇక్కడి వ్యాపారులు తక్కువ ధరకు వచ్చే పొరుగురాషా్ట్రల ధాన్యంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఇక్కడి రైతులు క్వింటాల్‌కు 1900 రూపాయలకు ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారు. దీంతో క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున నష్టపోతున్నారు.