Share News

kumaram bheem asifabad-పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:16 PM

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను తొలగించారు

kumaram bheem asifabad-పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. స్లాప్టిక్‌ వ్యర్థాల వల్లే పారిశుధ్యం లోపించడమే కాకుండా పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఎక్కడైనా చెత్త కనిపిస్తే దానిని తీసి డస్ట్‌ బిన్‌లో వేయాలని చెప్పారు. ఎవరైనా చెత్తను రోడ్డుపై వేస్తే దానిని తీసి డస్ట్‌ బిన్‌లో వేయాలని గాంధీజీ సూత్రాన్ని పాటించాలన్నారు. మున్సిపల్‌, గ్రామ పంచాయతీల అధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల్లో వేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీడబ్ల్యూఓ భాస్కర్‌, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, హర్టికల్చర్‌ అధికారి నదీమ్‌, వెటర్నరీ అధికారి సురేష్‌, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో పెండింగ్‌ పైళ్లను పరిశీలించి వాటిని త్వరిగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటివంచాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆలసత్వం వహించవద్దని ఆయన సూచించారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికా కార్యక్రమం శుక్రవారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో పాత వస్తువులను తొలగించడంతో పాటు కార్యాలయ ఆవరణలో పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆనంద్‌రావు, లక్ష్మణ్‌, నానేశ్వర్‌, అంబారావు, ఎంపీవో సాయిరాంగౌడ్‌, కార్యదర్శులు మురళీధర్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎంపీడీఓ జ్యోత్స్న అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిశుభ్రత లోపించకుండా చూడాలని ఆదేశించారు. కార్యాలయంలో పెండింగ్‌ పైళ్లను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో జావీద్‌, ఏపీవో శ్రావణ్‌ పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): పెంచికలపేట మండలంలో ప్రజాపాలన- పగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీడీవో ఆల్బర్ట్‌ ఆధ్వర్యంలో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలను, చెత్త చేదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న నర్సరీని, పాఠశాలలో నిర్మిస్తున్న కిచెన్‌ షెడ్‌, వీఓ భవనంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాంచందర్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయల ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. కార్యాలయంలోని అన్ని గదులను శుహభ్రం చేయించారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు శుభ్రం చేయించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు ఇంటి పన్ను వసూలు తదితర అంశాలపై సమీక్షించారు.

Updated Date - Mar 06 , 2026 | 11:16 PM