మహేశ్వరంలో శివాజీ విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తత
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:06 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్ర హ ఏర్పాటు వివాదానికి దారి తీసింది.
రెండు వర్గాల మధ్య వాగ్వాదం
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
మహేశ్వరం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్ర హ ఏర్పాటు వివాదానికి దారి తీసింది. బుధవారం అర్ధరాత్రి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా పలువురు బీజేపీ నాయకులు స్థానిక అంబేడ్కర్ కూడలిలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై దళిత సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, దళిత సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, మత విద్వేషాలకు తావు లేకుండా ఉండాలని కోరారు. శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి మహేశ్వరం గ్రామ పంచాయతీలో భద్రపరిచారు. మహాశివరాత్రి అనంతరం విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయపై నిర్ణయం తీసుకుంటామని.. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డిలు ఇరు వర్గాలకు హమీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.