ధాన్యం సేకరణలో మంత్రులవి తప్పుడు లెక్కలు
ABN , Publish Date - May 30 , 2026 | 04:23 AM
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రు లు తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవ గణాంకాలు తమ వద్ద ఉన్నాయని ...
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రు లు తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవ గణాంకాలు తమ వద్ద ఉన్నాయని వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుల పంటలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పుతోందని మండిపడ్డారు. రైతు గోస.. బీజేపీ భరోసా పేరిట తాము యాత్ర నిర్వహించిన తర్వాతే మంత్రులు ఆగమేఘాలపై సమీక్ష నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ‘ఈ సమీక్ష ముందే నిర్వహించలేదేం? పక్కా కార్యాచరణ ఎందుకు రూపొందించలేదు? రైతుల గోసను పట్టించుకోలేదేం?’ అని మహేశ్వర్‌రెడ్డి మంత్రులను ప్రశ్నించారు. అధికార గోస మంత్రులకే ఉందని అందుకే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎంత ఇండెంట్ ప్రతిపాదిస్తే అంతమేర తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళారీగా వ్యవహరిస్తోంది. రైతుల కష్టాన్ని దోచుకుంటోంది అని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్థాలు చెప్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్ల సమేస్య లేకుంటే ఇసుక, సిమెంట్ లారీలను, ట్రాక్టర్లను ఆపేసి ధాన్యం తరలించాలని రాత్రికి రాత్రే సమీక్షా సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. మంత్రులు తుమ్మల, భట్టి, పొన్నంలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తుమ్మల గన్నీ బ్యాగుల కొరతకు బంగ్లాదేశ్ యుద్థానికి ముడిపెట్టడం హాస్యాస్పదమన్నారు.