బండి భగీరథ్ కేసులో పొన్నం వ్యాఖ్యలు వ్యక్తిగతం
ABN , Publish Date - May 13 , 2026 | 03:56 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ...
అది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వైఖరి కాదు
ఆ బాలికకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది
ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి
కుమారుడిపై క్రిమినల్ కేసులో బండి సంజయ్ కులరాజకీయాలు తీసుకురావడం దురదృష్టకరం
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వైఖరులు కాదన్నారు. ఈ కేసులో నిందితుడు, బాధితురాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనందున.. ఆ సామాజిక వర్గ పెద్దలు ముందుకొచ్చి వివాహం జరిపించడం వంటి పరిష్కార మార్గాలను పరిశీలించాలని పొన్నం సూచించడంపై మంగళవారం మహేశ్ గౌడ్ ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. పాతికేళ్ల నిందితుడు, 17 ఏళ్ల మైనర్ బాలికకు సంబంధించిన ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాన్ని పరస్పర సమ్మతితో ఉన్న సంబంధంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక ఇచ్చే సమ్మతి చట్టబద్ధం కాబోదన్నారు. కాబట్టి సమ్మతి, సంబంధం, సామాజిక రాజీ వంటి వాదనలు చట్టపరంగానూ, నైతికంగానూ అంగీకార యోగ్యం కావన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన చట్టాలకంటే ఎవరూ పైచేయి కాదని, చట్టం ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బండి సంజయ్ ఈ కేసులో కుల రాజకీయాలు తీసుకురావడానికి, తన కుటుంబాన్ని బాధితులుగా చూపించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక మైనర్ బాలిక విషయాన్ని తేలికగా చూపించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఆ బాలికకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు.
ఆ సంఘాలు బాధితురాలి పక్షాన కూడా నిలబడాలి: మంత్రి పొన్నం
బండి భగీరథ్ కేసులో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఈ కేసులో కాంగ్రెస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కొన్ని మున్నూరుకాపు సంఘాలు చేసిన విమర్శలపై స్పందిస్తూ బాధితురాలిదీ మున్నూరుకాపు సామాజిక వర్గమేనని, ఇష్యూని సెటిల్ చేయాలని ఆ సంఘాలకు సూచించానన్నారు. పెళ్లి చేస్తారో.. ఇంకేం చేస్తారో కానీ.. ఇష్యూని సెటిల్ చేయాలని మాట్లాడానే కానీ, బాధితురాలికి న్యాయం జరిగే విషయంలో రాజీ పడేది లేదన్నారు. మున్నూరు కాపు సంఘాలు బాధితురాలికి న్యాయం కోసం ఆమె పక్కనా నిలబడాలని కోరారు.
ఒక కేంద్ర మంత్రి కుమారునిపై పోక్సో కేసు నమోదైతే తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎలా అంటారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తన కొడుకు ఎలాంటి తప్పూ చేయలేదని బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారు, శ్రీరాముని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలన్నారు.