Share News

అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:53 AM

అణగారిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని...

అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : అణగారిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ ఎస్సీ సెల్‌ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని గ్రామస్థాయి నుంచీ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి ప్లాజా హోటల్‌లో సోమవారంనాడు జరిగిన ఎస్సీ సెల్‌ కార్యవర్గ సమావేశంలో మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. దళిత సమాజాన్ని కాంగ్రెస్‌ పార్టీ వైపు మరింతగా ఆకర్షించే విధంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించి కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచాలన్నారు. సెల్‌ చైర్మన్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ యాప్‌ ద్వారా సభ్యుల వివరాలు, సంస్థాగత నిర్మాణం, కార్యక్రమాల అమలును మరింత సమర్థంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళిని అర్పిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Jun 02 , 2026 | 04:53 AM