బీఆర్‌ఎస్ దోపిడీలో కవితకూ భాగస్వామ్యం
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:02 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలో కవితకూ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ఆరోపించారు.
దానిపై ఎందుకు వివరణ ఇవ్వలేదు?: మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలో కవితకూ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ఆరోపించారు. ఆ దోపిడీపై కవిత ఎందుకు వివరణ ఇవ్వడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా తమకు అభ్యంతరమేమీ లేదని, కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు ఉన్నాయా లేక పందికొక్కులు ఉన్నాయా అనే విషయం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు తెలియదా అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమన్నారు. రాష్ట్రంలో మహిళా కేంద్రంగా ప్రజాపాలన సాగుతోందని, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు రాజకీయం తెలియదని కవిత చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చని చమత్కరించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న కవిత.. ఇప్పుడు బయటకు రావడం వెనుక దోచుకున్న సొమ్ము పంచుకోవడంలో వచ్చిన తేడాలే కారణమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అని విమర్శిస్తే కవితకు మార్కులు పడవని, ఆమె ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన వేల కోట్ల అవినీతిని కవిత పరోక్షంగా అంగీకరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, ప్రసంగాలు కాకుండా కవిత అప్రూవర్‌గా మారి ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు.