Share News

సింగరేణి స్కామ్‌ అంతా బీఆర్‌ఎస్‌దే

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:07 AM

సింగరేణి స్కామ్‌’కు కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం.. అన్నీ బీఆర్‌ఎస్సేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టు పొందిన సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ....

సింగరేణి స్కామ్‌ అంతా బీఆర్‌ఎస్‌దే

  • కథ, స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వం.. అన్నీ ఆ పార్టీయే

  • బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి

  • ఆయనను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ మనీ లాండరింగ్‌

  • మునిసిపల్‌ ఎన్నికల్లో వారిది అభ్యర్థులు దొరకని దుస్థితి

  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం

  • మీనాక్షీ నటరాజన్‌ను మారుస్తారన్న ప్రచారం అవాస్తవం

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌

న్యూఢిల్లీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘సింగరేణి స్కామ్‌’కు కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం.. అన్నీ బీఆర్‌ఎస్సేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టు పొందిన సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అల్లుడేనన్నారు. సృజన్‌ రెడ్డిని అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడిందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. నైనీ బ్లాక్‌ టెండర్ల వివాదం పూర్తిగా మీడియా సృష్టేనని పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని శబరి బ్లాక్‌లో మహేశ్‌గౌడ్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరుపై నడకేనని, అత్యధిక మునిసిపాలిటీలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేకించి నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు నాయకులు భయపడుతున్నారని, కనీసం డిపాజిట్లు కూడా రావేమోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తామని, కల్వకుంట్ల కవిత కూడా రాజకీయ పార్టీని ప్రకటించే అలోచనలో ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.


బీజేపీకి అధికారం అసాధ్యం..

బీజేపీ ఎంత ప్రయత్నించినా తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని మహేశ్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ సామాజిక పరిస్థితులు బీజేపీకి అనుకూలం కాదని, దాదాపు 70 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి సరైన అభ్యర్థులే లేరని తెలిపారు. కర్ణాటక పరిస్థితులు, తెలంగాణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏ స్థాయిలో దోచుకున్నారో ప్రజలకు అర్థమైందన్నారు. కేటీఆర్‌ సోషల్‌ మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, అది ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలు పనిని కొలమానంగా చేసుకుని ఓట్లు వేస్తారు తప్ప.. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలను చూసి ఓట్లు వేయరని అన్నారు. పంచాయతీ ఎన్నిల్లాగే మునిసిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ను మారుస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని మహేశ్‌గౌడ్‌ అన్నారు. అతి తక్కువ సమయంలోనే ఆమె తెలంగాణ రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని, తనతోపాటు ముఖ్యమంత్రితో ఆమెకు మంచి సమన్వయం కుదిరిందని తెలిపారు. రాష్ట్రంలో రెండు డీసీసీ అధ్యక్షుల నియామకం పెండింగ్‌లో ఉందన్నారు. త్వరలోనే ఏఐసీసీ పరిశీలకులు మరోసారి ఆ రెండు జిల్లాలో పర్యటిస్తారని, ఆ నివేదికల ఆధారంగా జిల్లా అధ్యక్షుల ప్రకటన ఉంటుందని చెప్పారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బీసీ సహా ఇతర కమ్యూనిటీ అధ్యక్షుల నియామకం, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పోస్టులు.. అన్నింటినీ మునిసిపల్‌ ఎన్నికల తర్వాత భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య మంచి సమన్వయం ఉందని, కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 04:07 AM