Share News

‘అయోధ్య’ పై నబీన్‌ మాట్లాడరేం?

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:57 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్ర పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ ఎద్దేవా చేశారు. అయోధ్య రామ మందిరంలో హుండీ కానుకల దోపిడీ గురించి..

‘అయోధ్య’ పై నబీన్‌ మాట్లాడరేం?

  • బీజేపీ ముక్త్‌ భారత్‌ను ప్రజలు కోరుకుంటున్నారు

  • యాదగిరిగుట్ట అభివృద్ధి కోసమే కమిటీ

  • రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తాను

  • దీనిపై సీఎంతో మాట్లాడతా?: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాష్ట్ర పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ ఎద్దేవా చేశారు. అయోధ్య రామ మందిరంలో హుండీ కానుకల దోపిడీ గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినా.. ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజలు ప్రస్తుతం బీజేపీ ముక్త్‌ భారత్‌ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో సీఎం రేవంత్‌ అన్నట్లుగా రాష్ట్రంలో 2034 వరకూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొనసాగుతుందన్నారు. బీజేపీ.. ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా తెలంగాణలో కాంగ్రె్‌సను ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో ఎంత రెచ్చగొట్టాలనుకున్నా ఇక్కడి ప్రజలు సంయమనం పాటిస్తారని అన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పుల్ని తీర్చడానికే ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే.. కొత్తగా వీబీ జీరామ్‌జీ పేరిట కేంద్రం కొత్తగా భారం మోపడం సరికాదన్నారు. మూసీ ఆధునికీకరణ తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7వేల కోట్లని, అందులో లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాగా, యాదగిరిగుట్టను గొప్పగా తీర్చిదిద్దాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని, ఆ నేపథ్యంలోనే పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా కొందరు వ్యక్తులు, నిష్ణాతులతో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారని తెలిపారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. భగవంతుడి దగ్గర ప్రాంతాలు ఉండవని, టీడీటీ పాలకమండలిలో తెలంగాణ వ్యక్తులు లేరా? అని ప్రశ్నించారు. మండలి నియామకంలో తనను సంప్రదించలేదంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని, ఈ అంశంపై తాను రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడానని, సీఎంతోనూ మాట్లాడతానన్నారు. అక్కడి అవసరాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని, అన్నింట్లో అందర్నీ భాగస్వాములను చేయలేమని చెప్పారు.

Updated Date - Jul 02 , 2026 | 04:57 AM