Share News

కేసీఆర్‌కు నోటీసుల వెనక ఏ రాజకీయ దురుద్దేశం లేదు

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:58 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారించేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు.

కేసీఆర్‌కు నోటీసుల వెనక ఏ రాజకీయ దురుద్దేశం లేదు

  • వాస్తవాలు వెలికితీసేందుకు సిట్‌ ఎవరికైనా ఇవ్వొచ్చు

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారించేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. ఈ కేసులో ఎవరి భాగస్వామ్యం ఉందో తేలాల్సి ఉందని, వాస్తవాలు తెలుసుకునేందుకు సిట్‌ ఎవరికైనా నోటీసులు జారీ చేయవచ్చని చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 500 మందికి పైగా ఫోన్లు ట్యాప్‌ అయినట్లుగా సమాచారముందని చెప్పారు. అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడబోరని.. ఆనాటి సీఎం లేదా మంత్రుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగబోవని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సిట్‌.. విచారణ పూర్తి చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని, ప్రజలూ అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీ ఫారాలు ఇచ్చే విషయంలో ఇన్‌చార్జ్‌ మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు.

Updated Date - Jan 30 , 2026 | 03:58 AM