Share News

12 ఏళ్ల టెండర్లన్నీ తవ్వాలి

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:04 AM

సింగరేణికి సంబంధించి పన్నెండేళ్లలో నిర్వహించిన టెండర్లన్నింటినీ సమీక్షించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు...

12 ఏళ్ల టెండర్లన్నీ తవ్వాలి

సింగరేణి టెండర్లన్నింటిపైనా రివ్యూ చేయాలి.. నైనీ బ్లాక్‌ టెండర్లపై పారదర్శక విచారణ జరగాలి

సమగ్ర విచారణకు ఐదురోజుల క్రితమే కిషన్‌రెడ్డిని కోరాను

కేటీఆర్‌, హరీశ్‌ కాంట్రాక్టుల బాగోతాన్ని కవితే బయట పెట్టారు

మంత్రులతో ఉపముఖ్యమంత్రి సమావేశం కావడం తప్పు కాదు

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌

14 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో ‘సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌’ భేటీ

న్యూఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి సంబంధించి పన్నెండేళ్లలో నిర్వహించిన టెండర్లన్నింటినీ సమీక్షించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్ల వ్యవహారంపై పారదర్శక విచారణ అవసరమన్నారు. ఈ టెండర్ల ఆరోపణలపై సమగ్రంగా విచారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని ఐదు రోజుల క్రితమే కోరానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌’లో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో 14 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులతో సమీక్ష చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, వైఎస్‌ షర్మిలారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘సంస్థాగతంగా రానున్న మూడు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించాం. ఎస్‌ఐఆర్‌ పేరుతో కేంద్ర చేస్తున్న ఓట్ల చోరీని అడ్డుకునేందుకు సమర్థమైన ప్రణళికపై కసరత్తు చేశాం. కాంగ్రెస్‌ పార్టీని గ్రామ, మండల, బ్లాక్‌, జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. నరేగా నుంచి గాంధీజీ పేరు తొలగింపు, నిధుల్లో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశాం. ’’ అని మహేశ్‌గౌడ్‌ వివరించారు. కేంద్రం పనిదినాలు పెంచామని చెబుతూనే రాష్ట్రాలపై భారం మోపుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణపై రూ.7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రం 40 శాతం భారాన్ని మోసే పరిస్థితుల్లో ఉందా? అని ప్రశ్నించారు.


సీఎం రాగానే ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తా

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తానని మహేశ్‌గౌడ్‌ అన్నారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కావడంలో తప్పేమీ లేదన్నారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై భట్టివిక్రమార్క మంత్రులతో సమావేశం నిర్వహించి ఉంటారు. నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల వివాదంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఐదు రోజుల క్రితమే కోరాను. అలాగే, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన టెండర్లన్నింటిపైనా రివ్యూ చేయాలని కోరాను. ఎలాంటి లొసుగులు చోటుచేసుకున్నాయో, ఎటువంటి లబ్ధి పొందారో వాటిపై విచారణ చేయాలి. అదే క్రమంలో ఈ రెండేళ్లలో జరిగిన టెండర్లపై కూడా విచారణ జరపాలి. వాస్తవాలన్నీ తేలాలని మేమే కోరుతున్నాం. గత పదేళ్లలోనే అవినీతి అంతా జరిగింది. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న కాంట్రాక్టర్లంతా బీఆర్‌ఎస్‌ హయాంలోనే లబ్ధి పొందారు. బీఆర్‌ఎస్‌ తీరు దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లకు బీఆర్‌ఎస్‌ హయాంలోనే మూడు కాంట్రాక్టులు దక్కింది నిజం కాదా? పదేళ్లు అధికార పార్టీలోనే ఉన్న కేసీఆర్‌ కుమార్తె కవితనే స్వయంగా వారి అవినీతి గురించి చెబుతున్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ ఏ విధంగా కొందరికి లబ్ధి చేకూర్చారో కూడా ఆమె వెల్లడించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని మహేశ్‌గౌడ్‌ అన్నారు.

కవిత చేరిక ప్రతిపాదనను వ్యతిరేకించాను..

ఫోన్‌ ట్యాపింగ్‌లో ప్రయేయం ఉన్న అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని మహేశ్‌గౌడ్‌ అన్నారు. పీసీసీ చీఫ్‌గా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, ఇందులో ప్రయేయం ఉన్న వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనే ప్రతిపాదన ఏఐసీసీలో వచ్చినప్పుడు తానే వ్యతిరేకించానని తెలిపారు. కవిత కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పానన్నారు. 12 ఏళ్లుగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, ఈ బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా నిధులు కేటాయించాలని కోరారు. ఈ విషయమై కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులను కలిసి విన్నవిస్తారని పేర్కొన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి మాట్లాడుతూ.. గణతంత్ర వేడుకల్లో రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేను అవమానించడం సరికాదని, బీజేపీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదని అన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పీసీసీ అధ్యక్షులతో కేసీ వేణుగోపాల్‌ చర్చించారు. బ్లాక్‌ కమిటీల నియామకం నెలరోజుల్లో జరగాలని సూచించారు. బూత్‌ స్థాయి కమిటీలను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Jan 27 , 2026 | 04:04 AM