Mahesh Goud: నేను నంబర్ 2
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:59 AM
రాష్ట్రంలో నేను నంబర్ 2’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎవరినీ అడగలేదని చెప్పారు.
నాకు మంత్రి పదవి అవసరం లేదు
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో నేను నంబర్ 2’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎవరినీ అడగలేదని చెప్పారు. విప్ రామచంద్రనాయక్‌తో కలిసి అసెంబ్లీ లాబీ వైపు ఆయన వస్తుండగా... కాబోయే ఇద్దరు మంత్రులు కలిసి వస్తున్నారంటూ విలేకరులు వారి వద్ద ప్రస్తావించారు. దీనికి మహేశ్‌గౌడ్ స్పందిస్తూ తాను నెంబర్ టూ స్థానంలో ఉన్నానని అన్నారు. మంత్రి పదవి వస్తే... కేవలం ఒకే శాఖను చూడాల్సి ఉంటుందని, తాను ఇప్పుడు అన్ని శాఖల గురించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తాను ఫోన్‌లో పరామర్శించానని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని వివరించారు.
హోంమంత్రిని అవుతా:ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
అమిత్‌షాను తీసేసినియమిస్తారేమో: దానం
మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని మహేశ్‌ను ఉద్దేశించి అన్నారు. దీనికి మహేశ్ బదులిస్తూ.. మీకు ఆ స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా తాను హోం మంత్రిని అవుతానని, రాసి పెట్టుకోవాలని రాకేశ్‌రెడ్డి అన్నారు. అక్కడే ఉన్న దానం నాగేందర్ స్పందిస్తూ అమిత్‌షాను తొలగించి.. రాకేశ్‌రెడ్డిని కేంద్ర హోంమంత్రిగా నియమిస్తారేమోనని వ్యంగ్యంగా అన్నారు. శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసినా ఆ 10 మంది ఎమ్మెల్యేలు సభలోనే ఉన్నారని విలేకరులు ప్రస్తావించగా... అవును అంటూ దానం బదులిచ్చారు. అనర్హత ముప్పు, మళ్లీ పోటీ గురించి విలేకరులు ప్రశ్నించగా... తాను దేనికైనా సిద్ధమని దానం స్పష్టం చేశారు.