Share News

ముందు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇప్పించండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:40 AM

రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇప్పించమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరుతున్నారని, ముందుగా మోదీ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తే 12 ఏళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయంపై ...

ముందు మోదీ అపాయింట్‌మెంట్‌ ఇప్పించండి

  • 12 ఏళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయంపై చర్చిద్దాం

  • ఆ తర్వాత రాహుల్‌ గాంధీనిబీజేపీ నేతలకు కలిపిస్తాం

  • పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదు

  • కేటీఆర్‌ ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు: మహేశ్‌ గౌడ్‌

వరంగల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇప్పించమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరుతున్నారని, ముందుగా మోదీ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తే 12 ఏళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయంపై చర్చిద్దామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీని బీజేపీ నేతలకు కలిపిస్తామని చెప్పారు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చిన మోదీ.. ఎంతమంది ఖాతాల్లో డబ్బులు వేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 12 ఏళ్లలో ఎంతమంది సామాన్యులకు ఉద్యోగాలిచ్చారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. సోమవారం హనుమకొండ కాంగ్రెస్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశం, బీఎల్‌ఏల అవగాహన కార్యక్రమంలో మహేశ్‌ గౌడ్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ నేతలు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని.. వరంగల్‌ వేదికగా బహిరంగ చర్చ సిద్ధమని ప్రకటించారు. నీట్‌ ఎగ్జామ్‌ రద్దుతో 25 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని.. నీట్‌ కోసం పిల్లలు, తల్లిదండ్రులు రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. పవన్‌ కల్యాణ్‌ను సినీ నటుడిగా గౌరవిస్తామని, అయితే తెలంగాణ రాజకీయాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే పది రోజులు పస్తులు ఉన్నానన్న పవన్‌కు అసలు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్నారు. అంతర్గత విభేదాలు, ఆస్తి వివాదాలు కారణంగా ఆ పార్టీలో చీలికలు వచ్చాయన్నారు. కేటీఆర్‌ ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నారని ప్రశ్నించారు. వారు పదేళ్ల పాలనలో చేసిన దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. గత పదేళ్లలో కుంటలు, చెరువులను ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని హైడ్రా తొలగిస్తే తప్పా అని ప్రశ్నించారు. ‘సర్‌’పై కాంగ్రెస్‌ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రె్‌సకు అనుకూలంగా భావిస్తున్న ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, గిరిజన వర్గాల ఓట్ల ను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వంద ఎమ్మెల్యే స్థానాలు గెలిచి.. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ జరిగితే ఇంకా ఎక్కువే సీట్లు గెలుస్తామన్నారు.

ఓటర్లను చైతన్యం చేయాలి: మంత్రి పొన్నం

‘సర్‌’పై ఓటర్లను బీఎల్‌ఏలు, కాంగ్రెస్‌ కార్యక్తలు చైతన్యం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు ఎక్కడైనా జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 02:40 AM