ఉద్యమ కేసులతో ట్యాపింగ్ కేసుకు పోలికా?
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:25 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైనదని, ఈ కేసును తెలంగాణ ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.
కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మహేశ్‌గౌడ్
కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని చెప్పానని వెల్లడి
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రమైనదని, ఈ కేసును తెలంగాణ ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ట్యాపింగ్ కేసు ఎంత తీవ్రమైనదో టెలిగ్రాఫ్ చట్టం చదివితే తెలుస్తుందని.. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మార్పు ఉండబోదన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఆమెను మారుస్తారని తాను అనుకోవట్లేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు. కవిత కాంగ్రె్‌సలో చేరనున్నారన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఒకవేళ ఆమె వచ్చినా పార్టీలోకి తీసుకోవద్దంటూ అధిష్ఠానానికి తన అభిప్రాయంగా చెప్పినట్లు వెల్లడించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మహేశ్ గౌడ్ చిట్‌చాట్ చేశారు. నిబంధనల ప్రకారం విచారణ జరుగుతుంటే వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సిట్ విచారణలో ఆయన ప్రమేయం ఉన్నట్లు తేలితే జైలు తప్పదని వ్యాఖ్యానించారు. తోడబుట్టిన చెల్లెలే తన భర్త ఫోన్‌నూ ట్యాప్ చేశారని చెబుతుంటే.. కేటీఆర్, హరీశ్‌రావు దగ్గర్నుంచి సమాధానం లేదన్నారు. సిట్ విచారణకు కవితను, ఆమె భర్తనూ పిలవాలన్నారు.
దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబ దోపిడీ..
పదేళ్ల పాలనలో ఆలీబాబా 420 దొంగల మాదిరిగా కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని మహేశ్ గౌడ్ అన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసేందుకు వీలుంటుందని చెప్పారు. నక్సలైట్లతో సంప్రదింపులు జరుపుతున్నానని ఆరోపిస్తూ తన ఫోన్‌నూ ట్యాప్ చేశారని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబంలో తగదాలకు మూలం వాటాల పంపకాల్లో తేడాలేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో పారదర్శకత పెరిగిందని తెలిపారు. సిట్ విచారణ లోతుగా జరుగుతున్నందునే జాప్యం జరుగుతోందన్నారు. విచారణ టీవీ సీరియల్‌లాగా కొనసాగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించారు. కాళేశ్వరం అవినీతికి సంబంధించి కేసీఆర్ కుటుంబంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఈ నెల 28 నుంచి తాను, మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నట్లు వస్తున్న వార్తలపై వివరాలివ్వాలని స్థానిక నాయకత్వానికి సూచించినట్లు చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఏమీ పాల్పడలేదని స్పష్టం చేశారు.