కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్..!
ABN , Publish Date - May 02 , 2026 | 05:11 AM
కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్ తగిలిందని, కూతురు పెట్టిన కుంపటి వల్లనే ఆయన ఫాంహౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.
కవిత ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఆయనకు లేదు.. కేసీఆర్‌తో కిషన్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం
అందుకే ‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణ జరగట్లేదు.. రెండు రోజుల్లో కుల ఫెడరేషన్ల చైర్మన్ల భర్తీ
మేలోనే కార్పొరేషన్లకూ చైర్మన్లు: మహేశ్ గౌడ్
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్ తగిలిందని, కూతురు పెట్టిన కుంపటి వల్లనే ఆయన ఫాంహౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు. వాటాల్లో తేడా రావడంతోనే కవిత కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. తమది విజనరీ ప్రభుత్వమని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే పేదలకు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డికి మధ్యనున్న లోపాయికారి ఒప్పందం కారణంగానే కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరగట్లేదని ఆరోపించారు. ప్రజా పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, బీఆర్‌ఎస్ ఎన్ని సభలు పెట్టినా ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. కాగా.. వివిధ కులాల అభివృద్ధి ఫెడరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లను రెండు, మూడు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే మే నెలలోనే వివిధ కార్పొరేషన్ల చైర్మన్ పదవులనూ భర్తీ చేస్తామని వెల్లడించారు. గాంధీభన్‌లో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ పతాకాన్ని మహేశ్ గౌడ్ ఆవిష్కరించారు. కార్మికులు అంటే వెట్టి చాకిరి చేసేవారు, కాదని.. వారు లేకుంటే ప్రపంచమే లేదని ఆయన అన్నారు. కార్మికులకు హక్కులు కల్పించడంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని.. 8 గంటల పనిదినం అమలు చేసిందే నెహ్రూ అని చెప్పారు.