ఏ ముఖంతో ఓట్లడిగేందుకు వచ్చారు
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:17 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏ ముఖం పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
మంది ఎంపీలనిచ్చిన తెలంగాణకుబడ్జెట్‌లో ఏమిచ్చారో చెప్పండి
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌పై మహే్‌శ్‌గౌడ్ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏ ముఖం పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీకి 8 మంది ఎంపీలను అందించిన తెలంగాణకు బడ్జెట్‌లో కేంద్రం ఏమిచ్చిందో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులకు ఎందుకు ఆమోదం తెలుపలేదో చెప్పి ఓట్లడగాలన్నారు. పుట్టుకతోనే బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ అని మహేశ్ కుమార్ అన్నారు. మతం పేరిట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని రెచ్చగొట్టాలన్న ప్రయత్నంలోనే నితిన్ నబీన్‌ను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చారని, కానీ, తెలంగాణ ప్రజలు విజ్ఞులని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టిన బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. మత వైషమ్యాలకతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ వాసులు బీజేపీని ఆదరించబోరని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చేది గుండు సున్నానేనని అన్నారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని ఆయన చెప్పారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 13600 కోట్లే కేటాయించారన్న మహేశ్ కుమార్.. కేంద్ర మంత్రికి హైదరాబాద్, మూసీ ఆధునీకరణ కంటే అహ్మదాబాద్, నర్మదా నది ఆధునీకరణపైనే ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా బీసీలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. కాగా, ఆయన మున్సిపల్ ఎన్నికల సోషల్ మీడియా ప్రచారాన్ని గాంధీభవన్‌లో ప్రారంభించారు.