Share News

పాలమూరులో త్రిముఖ పోరు

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:32 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలపోరు హోరాహోరీగా సాగుతోంది. మెజారిటీ మునిసిపాలిటీల్లో త్రిముఖ పోటీ నెలకొంది.

పాలమూరులో త్రిముఖ పోరు

  • మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు రెబల్స్‌తో ముప్పు

  • మేయర్‌ పీఠం తమదేనంటున్న బీజేపీ

  • బీఆర్‌ఎస్‌లో శ్రీనివా్‌సగౌడ్‌ ఒంటరిపోరు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలపోరు హోరాహోరీగా సాగుతోంది. మెజారిటీ మునిసిపాలిటీల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రధాన పోటీదారులుగా ఉండగా, కొన్ని మునిసిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో బరిలోకి దిగినవారు కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఇది తొలి ఎన్నిక కాగా, మూడు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 60 డివిజన్లలోనూ పోటీ చేస్తోంది. ఇప్పటికే 58వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవడంతో ఏకగ్రీవమై ఒక సీటు కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. మిగిలిన వాటిలో 20కి పైగా డివిజన్లలో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా డివిజన్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఆ వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చాయి. ఎన్నికల అనంతరం కాంగ్రె్‌సకు.. మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా తక్కువ స్థానాలు వస్తే ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే.. డిప్యూటీ మేయర్‌ పదవిని ఎంఐఎం కోరే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రె్‌సకు మెజారిటీ వచ్చినా.. ఎక్కువ స్థానాల్లో ప్రభావం చూపే మైనారిటీ వర్గం వారే డిప్యూటీ మేయర్‌ పదవిని కోరతారు. కాగా, కాంగ్రె్‌సకు ప్రధానంగా రెబల్‌ అభ్యర్థుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంది. అన్ని డివిజన్లలో కలిపి 61 మంది రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉండడం కాంగ్రె్‌సను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే రెబల్స్‌లో ఎవరైనా గెలిచి.. తమకు మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా తక్కువ స్థానాలు వస్తే వారు ఉపయోగపడతారన్న యోచనలోనూ ఉంది.


ఎవరి ధీమా వారిదే..

మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు. కార్పొరేషన్‌ పరిధిలోనే రూ.1282 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సొంత జిల్లా కావడంతో ఈ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని సీఎం సీరియ్‌సగా ఉన్నారు. అదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్‌ ఎంత ప్రయత్నించినా.. అప్పుడే సాధ్యం కాలేదని, ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఎంపీ డీకే అరుణ ధీమాగా ఉన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్‌ తెలంగాణలో తన తొలి పర్యటన మహబూబ్‌నగర్‌లోనే చేపట్టి హీట్‌ను మరింత పెంచారు. కాగా, బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఒంటరి పోరాటం చేస్తున్నారు. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే అంతర్గత సర్వే ప్రకారం 36 వరకు డివిజన్లు వస్తాయనే ధీమాతో కాంగ్రెస్‌ ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తుకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.

మునిసిపాలిటీల్లోనూ హోరాహోరీ...

గద్వాలలోని మునిసిపాలిటీలో వర్గపోరు తీవ్రంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జిల్లాలోని అయిజ మునిసిపాలిటీ కొంతమేర బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా కనిపిస్తుండగా, వడ్డేపల్లిలో సింహం గుర్తు ప్రభావం చూపనుంది. కాగా, అలంపూర్‌లోని 10 వార్డుల్లో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఒక వార్డును తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన వాటికి తీవ్ర పోటీ నెలకొంది. వనపర్తి జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు ఉండగా.. కాంగ్రె్‌సకు ఎక్కువ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్‌ నియోజకవర్గంలో కాంగ్రె్‌సకు ఎదురీత తప్పడం లేదు. మక్తల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా, ఆత్మకూరులో బీఆర్‌ఎ్‌సకు సానుకూలత కనిపిస్తోంది. నాగర్‌కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్‌ సహా అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రె్‌సకు ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లోని మద్దూరు, కోస్గి మునిసిపాలిటీలు కాంగ్రెస్‌ వశమయ్యే అవకాశాలున్నప్పటికీ మద్దూరులో బీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ కనిపిస్తోంది. నారాయణపేటలో త్రిముఖ పోరు నెలకొంది.

Updated Date - Feb 09 , 2026 | 02:32 AM