కనగల్ శివాలయానికి మహర్దశ
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:19 AM
నల్లగొండ జిల్లా కనగల్ గ్రామంలోని పురాతన శివాలయం బండి రామలింగేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ పట్టింది.
ఆలయ అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
కనగల్, జూలై 1(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కనగల్ గ్రామంలోని పురాతన శివాలయం బండి రామలింగేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ పట్టింది. శిథిలావస్థలో ఉన్న వందల ఏళ్లనాటి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ.3కోట్ల సీజీఎఫ్ నిధులు విడుదల చేసింది. ఆలయ ప్రశస్థాన్ని పురస్కరించుకుని పూర్తిగా రాతితోనే ఆలయాన్ని పునర్నిర్మిస్తారని చెబుతున్నారు. క్రీ.శ 13, 14వ శతాబ్ధంలో రాచకొండ దేవరకొండ రాజ్యాన్ని పాలించిన వెలమ/రెడ్డిరాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. వందల ఏళ్లుగా ఈ ఆలయంలో నిత్యపూజలు కొనసాగుతూనే ఉన్నాయి. కాలక్రమంలో శివాలయం శిథిలావస్థకు చేరుకుంటుందని ఆవేదన గ్రామస్థులు ఆ లయ పునర్నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివా్‌సగౌడ్ ఆధ్వర్యంలో గ్రామపెద్దలు ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు చేయించాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖను కలిసి కంట్రిబ్యూషన్ లేకుండా రూ.3కోట్ల సీజీఎఫ్ నిధులను గుడి అభివృద్ధి కోసం విడుదల చేయించారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో ఆలయ వంశపారం పర్య అర్చకులు పోతులపాటి శంకర్‌శర్మ, గిరిప్రసాద్‌శర్మ, గ్రామ సర్పంచ్‌నర్సింగ్ మురళీధర్‌గౌడ్, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆలయం అభివృద్ధి చెందుతుంది
పురాతన శివాలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ.3కోట్లు విడుదల చేయించిన మంత్రి వెంకట్‌రెడ్డికి కనగల్ గ్రామస్థుల తరుఫున కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ తరుఫున కంట్రిబ్యూషన్‌లేకుండా పెద్ద మొత్తంలో సీజీఎఫ్ నిధులు విడుదల కావడం ఇదే తొలిసారి. ఆలయం అభివృద్ధి చెందుతుంది.
నర్సింగ్ శ్రీనివా్‌సగౌడ్, మాజీ జడ్పీటీసీ