తెలంగాణ మునిసిపోల్స్ ఇన్‌చార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శేలార్
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:09 AM
అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జిలను నియమించింది. తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు.....
బెంగళూరు ఎన్నికల బాధ్యతలు రాంమాధవ్‌కు..
న్యూఢిల్లీ, జనవరి 21: అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జిలను నియమించింది. తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శేలార్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామీ, బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ సహ ఇన్‌చార్జులుగా ఆయనకు సహకరిస్తారు. పార్టీ సీనియర్ నేత రాంమాధవ్‌ను బృహద్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు. సీనియర్ నాయకుడు వినోద్ తావ్‌డేకు కేరళ బాధ్యతలు అప్పగించారు. తావ్‌డే చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్.. మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ఆఫీసు బేరర్లతో సమావేశమయ్యారు. తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, కేరళ, అసోం ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సన్నాహాలు, సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ‘వికసిత్ భారత్, జీరామ్‌జీ’ వంటి అభివృద్ధి పథకాలపై కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కూడా పాల్గొని తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై నివేదికలిచ్చారు.