మహాలక్ష్మి స్మార్ట్ కార్డులకు పౌరసరఫరాల డేటా.!
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:20 AM
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం త్వరలోనే ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు అందించనుంది.
వచ్చేవారం మార్గదర్శకాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం త్వరలోనే ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు అందించనుంది. ఈ ప్రక్రియ కోసం పౌర సరఫరాల శాఖ నుంచి సేకరించిన డేటాను ప్రామాణికంగా తీసుకుని తొలిదశలో 5 లక్షల మందికి ఆర్టీసీ యాజమాన్యం జారీ చేయనుంది. తెల్ల రేషన్ కార్డులో పేర్లు ఉన్న మహిళలకు మొదటి దశలో స్మార్ట్ కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. జూన్ 2 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న ఈ విధానం కోసం వచ్చేవారం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. మహిళలు బస్‌పాస్ కేంద్రాలు, మీ-సేవా కేంద్రాలలో రూ. 50 చెల్లించి ఈ స్మార్ట్ కార్డులను పొందవచ్చు. కార్డు లేని వారు ప్రస్తుత విధానం ప్రకారమే ఆధార్ కార్డు చూపిస్తూ తమ ఉచిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 8,578 కోట్లు విలువైన ఉచిత ప్రయాణాలు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల ప్రతి నెల సగటున రూ. 357 కోట్ల అదనపు భారం ఆర్టీసీపై పడుతోంది.