జైలు గోడ దూకి పారిపోయిన రిమాండ్ ఖైదీ
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:24 AM
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్లితో ఒక్కటయ్యారు.. కానీ, పెళ్లికి వయస్సు సరిపోలేదు.. వధువు మేజర్ కావడానికి మరో 15 రోజులు తక్కువగా ఉండడంతో ....
గత నెలలో అతడిపై పోక్సో కేసు నమోదు
ప్రేయసిని చూసేందుకు తప్పించుకుని వెళ్లిన వైనం
నేరుగా సొంత ఊరికి వెళ్లి ప్రేయసి తండ్రికి ఫోన్
కాసేపటికే నానో యూరియా తాగి ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్/ హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్లితో ఒక్కటయ్యారు.. కానీ, పెళ్లికి వయస్సు సరిపోలేదు.. వధువు మేజర్ కావడానికి మరో 15 రోజులు తక్కువగా ఉండడంతో ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. 25 రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు సోమవారం తెల్లవారు జామున 18 అడుగుల ఎత్తైన గోడను దూకి పరారయ్యాడు. ప్రేయసిని కలిసేందుకు సొంతూరుకు వెళ్లి.. అనూహ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, జైలు నుంచి పారిపోయిన రోజే.. కోర్టులో అతడికి బెయిల్ మంజూరైంది. వనపర్తి జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు కిశోర్‌కుమార్‌రెడ్డి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ మొదటి వారంలో బంధువైన బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ అమ్మాయి వయస్సు 18 ఏళ్లకు 15 రోజులు తక్కువ ఉండడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అమరచింత పోలీసులు కిశోర్‌పై పోక్సో కేసు నమోదు చేసి జూన్ 12న మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. బాలికను వనపర్తి సఖి కేంద్రంలో ఉంచారు. తన ప్రేయసిని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్న కిశోర్.. జైలు గోడ దూకి పారిపోవడానికి కొన్ని రోజులుగా పథకం వేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున 18 అడుగుల ఎత్తైన గోడ మీదకు చేరుకున్న కిశోర్.. కండువాలను తాడులా చేసుకొని కిందికు దూకాడు. కాగా, జైలు నుంచి పారిపోయిన కిశోర్.. ఓ వ్యక్తి ఫోన్ నుంచి.. బాలిక తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. ‘‘మేమిద్దరం ప్రేమించుకున్నాం. అనవసరంగా నన్ను జైల్లో పెట్టారు’’ అని ఆవేదన వ్యక్తం చేయగా.. ఇద్దరికీ పెళ్లి చేసేందుకు బాలిక తండ్రి ఒప్పుకొన్నట్లు తెలిసింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. చెరుకుతోటలో నానో యూరియా తాగి కిశోర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ఒక వైపు కిశోర్ జైలు నుంచి పారిపోగా.. అదే రోజు అతడికి వనపర్తి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇద్దరిపై వార్డెన్లపై సస్పెన్షన్ వేటు
జైలు నుంచి విచారణ ఖైదీ పరారైన ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వార్డెన్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. డీఐజీ శ్రీనివాస్ జిల్లా జైలును సందర్శించి విచారణ చేపట్టారు. విధులు నిర్వహించే ఇద్దరు వార్డెన్ల నిర్లక్ష్యం కారణంగానే ఖైదీ పరారైనట్లు గుర్తించి.. వారిని సస్పెండ్ చేశారు.