ఐదుగురి ప్రాణాలు తీసిన రేస్
ABN , Publish Date - May 12 , 2026 | 03:59 AM
యువకుల స్పోర్ట్స్ బైక్ రేసింగ్ సరదా ఆ దారిన కారులో వెళుతున్న అమాయకుల నిండు ప్రాణాలను బలిగొంది. కారును మితిమీరిన వేగంతో ఓ స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్నవారిలో...
మహబూబ్‌నగర్‌లో అర్ధరాత్రి 12 బైక్‌లతో యువకుల విన్యాసాలు
కారును ఢీకొన్న స్పోర్ట్స్ బైక్.. 10 అడుగుల మేర ఎగిరిపడ్డ వాహనాలు
కారులోని 8 మందిలో ముగ్గురి దుర్మణం.. నలుగురికి తీవ్రగాయాలు
మృతుల్లో తల్లీకొడుకు.. ప్రమాదానికి కారణమైన బైక్‌పైనున్న ఇద్దరూ మృతి
మహబూబ్‌నగర్, మే 11 (ఆంధ్రజ్యోతి): యువకుల స్పోర్ట్స్ బైక్ రేసింగ్ సరదా ఆ దారిన కారులో వెళుతున్న అమాయకుల నిండు ప్రాణాలను బలిగొంది. కారును మితిమీరిన వేగంతో ఓ స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన స్పోర్ట్స్ బైక్‌పై ఉన్న ఇద్దరూ ప్రాణాలొదిలారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. పట్టణంలోని ప్రేమ్‌నగర్, మర్లు ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి బైపాస్ రోడ్డులో ఉన్న యూబీగార్డెన్‌లో జరిగిన ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు. వేడుక అనంతరం అక్కడి నుంచి వారంతా అదే కారులో రాత్రి 12:30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. అరగంట తర్వాత బైపాస్ రహదారిలో గల పాలకొండ చౌరస్తా శివాజీ విగ్రహం దగ్గర మర్లు వైపు వెళ్లేందుకు కారును తిప్పారు. అదే సమయంలో భూత్పూర్ రహదారి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న 12 రేసింగ్ బైక్‌లు పెద్దశబ్దం చేస్తూ దూసుకొచ్చాయి. వీటిలో ఓ స్పోర్ట్స్ బైక్, రోడ్డు క్రాస్ చేస్తున్న కారు వెనుక డోర్‌ను దాదాపు 180 కి.మీ. వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు కూడా పది అడుగుల మేర ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రేమ్‌నగర్‌కు చెందిన అర్షియా బేగం (30), ఆమె కుమారుడు హజీఫ్ (8), ఆమె మరదలు రేష్మా కుమారుడు అమర్ (2) అక్కడికక్కడే మృతిచెందారు. అర్షియా తల్లి గౌసియా, గౌసియా కూతురు రేష్మా, రేష్మా కుమారుడు హిమ్రానుద్దీన్, వారి బంధువుల కుమారుడు జాహిద్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న అర్షియా బేగం భర్త బాసిత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కళ్లెదుటే భార్య అర్షియా, కుమారుడు హఫీజ్ చనిపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఒవైజీ (25), అఫ్జల్ యాకుబ్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మహబూబ్‌నగర్ రూరల్, జడ్చర్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్థానిక జనరల్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే మిగతా బైక్ రేసర్లు అక్కడి నుంచి పరారయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.