వేములవాడలో శివరాత్రి వేడుకలు ఆరంభం
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:16 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో అనుబంధ భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.
భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో అనుబంధ భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి లక్ష్మీగణపతి పూజ, ప్రాతఃకాల పూజ నిర్వహించారు. సాయంత్రం భీమేశ్వరస్వామి వారికి టీటీడీ అర్చకులు పట్టువస్త్రాల సమర్పించారు. అర్ధరాత్రి తర్వాత స్థానికులు, దాతలు, అధికారులు దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా రూ.1.96 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 ఆర్డీసీ బస్సుల ద్వారా వేలాది మంది భక్తులు వేములవాడకు చేరుకున్నారు. ఆలయాన్ని పూర్తి స్థాయి విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ, బారికేడ్లు, ప్రత్యేక పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. 48గంటల పాటు శివార్చన కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఈసారి స్వామి వారిని ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం 48 గంటలు నిరంతరాయంగా కోడె మొక్కుల టికెట్ కౌంటర్లు తెరిచి ఉంచనున్నారు. రాజన్న సన్నిధిలో ఆదివారం శివరాత్రి సందర్భంగా ఏకాంతంగా పూజలు నిర్వహిస్తారు. ఈసారి ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రెజిమెంటల్ బజార్ నుంచి 91, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ నుంచి 117, అమ్ముగూడ నుంచి 70, ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి కీసరగుట్టకు మూడు రోజుల పాటు 330 ప్రత్యేక సర్వీసులను గ్రేట ర్ ఆర్టీసీ నడపనుంది. సీబీఎస్ నుంచి 115, పటాన్‌చెరు నుంచి 10 ప్రత్యేక బస్సులను ఏడుపాయలకు నడుపుతున్నారు. పటాన్‌చెరు నుంచి బీరంగూడకు 20 స్పెషల్ సర్వీసులు నడుపుతుంది. అలాగే బీహెచ్‌ఈఎల్, ఎంజీబీఎస్, జేబీఎ్‌సల నుంచి శ్రీశైలం, వేములవాడకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. రద్దీ పెరిగితే బస్సుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నా రు. ప్రత్యేక బస్సుల వివరాలు, ఇతర సమాచారం కో సం గ్రేటర్‌హైదరాబాద్ జోన్ కమ్యూనికేషన్ సెంటర్ నం. 9959226160ను సంప్రదించవచ్చని తెలిపారు.