జుట్టు పట్టి లాగి.. కాలితో తన్ని..
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:20 AM
హన్మకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం రణరంగంగా మారింది. కళాశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి విద్యార్థినులపై భౌతికదాడి చేస్తూ...
మడికొండ గురుకులంలో ప్రిన్సిపాల్ దాష్టీకం
కలెక్టరేట్‌కు కాలినడకన బయలుదేరిన బాలికలు
జాతీయరహదారిపై ధర్నా
గురుకులంలో దుర్భర పరిస్థితులపై ఆవేదన
మడికొండ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): హన్మకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం రణరంగంగా మారింది. కళాశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి విద్యార్థినులపై భౌతికదాడి చేస్తూ దాష్టీకంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆరోపించారు. 11 మంది విద్యార్థినులను జుట్టు పట్టి లాగి, వీపుపై పిడిగుద్దులు కురిపించినట్లు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక 110 మంది విద్యార్థినులు పాఠశాల నుంచి బయటకు వచ్చి కలెక్టరేట్‌కు కాలినడకన బయలుదేరారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్‌వారిని అడ్డుకోగా.. తమకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ‘మాకొద్దీ ప్రిన్సిపాల్.. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై విద్యార్థినులు పలు ఆరోపణలు చేశారు. ‘‘మమ్మల్ని ఆడపిల్లలని కూడా చూడకుండా పిచ్చికుక్కల్ని కొట్టినట్లు కొడుతోంది. పద్ధతిగా డ్రెస్ వేసుకుని, బొట్టు పెట్టుకుంటే అబ్బాయిల కోసమే తయారయ్యారా అంటూ అసభ్యంగా మాట్లాడుతోంది’’ అంటూ వాపోయారు. కులం పేరుతో దూషించడమే కాకుండా, మానసికంగా వేధిస్తోందని విద్యార్థినులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇక, గురుకులంలోని దుర్భర పరిస్థితులను విద్యార్థులు ఏకరువు పెట్టారు. 680 మంది విద్యార్థులు ఉన్న చోట.. 2, 3బాత్రూమ్‌లే ఉన్నాయన్నారు. ఆలస్యంగా వెళితే భోజనం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మరో 15 రోజుల్లో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయని, ఈ సమయంలో తమను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల హామీ.. శాంతించిన విద్యార్థులు
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జోనల్ ఆఫీసర్ అపర్ణ ఘటనా స్థలానికి స్వయంగా చేరుకుని నచ్చజెప్పినా విద్యార్థినులు వినలేదు. చివరకు జాయింట్ సెక్రటరీ సక్రునాయక్ ఫోన్ ద్వారా విద్యార్థినులతో మాట్లాడి, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడంతో విద్యార్థినులు నిరసన విరమించి గురుకులానికి వెళ్లారు.