Share News

దళితులకు మతం మారే స్వేచ్ఛ లేదా?

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:26 AM

క్రైస్తవ మతాన్ని స్వీకరించిన బీసీలు, ఎస్టీలు, అగ్రవర్ణ పేదలకు(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్ల పరంగా లేని ఆంక్షలు దళితులకు మాత్రమే ఎందుకున్నాయని..

దళితులకు మతం మారే స్వేచ్ఛ లేదా?

  • బీసీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలకు లేని ఆంక్షలు వీరికే ఎందుకు?

  • దళితులకు వ్యతిరేకంగా నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు.. ఆ నలుగురు బ్రాహ్మణులే కారణం

  • మంద కృష్ణమాదిగ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌13(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మతాన్ని స్వీకరించిన బీసీలు, ఎస్టీలు, అగ్రవర్ణ పేదలకు(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్ల పరంగా లేని ఆంక్షలు దళితులకు మాత్రమే ఎందుకున్నాయని.. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నిలదీశారు. ఆనాడు దేవాలయాల్లోకి దళితులను రావద్దన్నారు.. ఈనాడు ఇంకో దేవాలయానికి వెళ్లొద్దంటున్నారు.. ఇంకెంతకాలం ఈ వివక్ష అని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా వర్గాల మాదిరిగా దళితులకు మతం మారే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తూ వెలువడిన 1950నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రస్తుత రాష్ట్రపతి రద్దు చేయాలని, అందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్టికల్‌ 14, 15, 25 ప్రకారం నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ దళితులకు ఉండాలన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించింది. దీనికి హాజరైన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ... ‘ఆనాటి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌, హిందూ మహాసభ సభ్యుడు కేఎం మున్షీ, క్రైస్తవుల ప్రతినిధి హెచ్‌జీ ముఖర్జీ... ఈ నలుగురు బ్రాహ్మణుల వల్లే దళితులకు వ్యతిరేకంగా ఆనాడు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయని’ విమర్శించారు. కుల వ్యవస్థ రద్దుపై బ్రాహ్మణుల వైఖరి వెల్లడించాలన్నారు. దళితులను గుడిలోకి రానివ్వకపోవడంతో క్రైస్తవులు వారిని చర్చిలోకి తీసుకెళ్లారని, మిషనరీల ద్వారా విద్యా, వైద్య సేవలను అందించారన్నారు. దళితుల మెడమీద కత్తిపెట్టి మతం గురించి శాసించడం ఘోరమైన అవమానంగా పేర్కొన్నారు. సిక్కు, బౌద్ధ మతాల్లో చేరిన దళితులకులాగా క్రైస్తవ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చేవరకు ఉద్యమిస్తానని మంద కృష్ణ ప్రకటించారు. తన పోరాటం బ్రాహ్మణులు, మాదిగల మధ్య కాదన్నారు. సంఘసంస్కర్త రామానుజాచార్య స్ఫూర్తితో అయోధ్యతో పాటు అన్ని హిందూ ఆలయాల్లో ప్రధానార్చకులుగా బ్రాహ్మణేతరులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఫూలే, అంబేడ్కర్‌ సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటే అడ్డుకుంది బ్రాహ్మణులే అన్నారు. వారి వల్ల బ్రాహ్మణేతర కులాలన్నీ బాధితులుగా మిగిలాయంటూ మంద కృష్ణ పలు వ్యాఖ్యానించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించేవరకూ పోరాడతామని ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ, ఎంఎంఎస్‌, ఎమ్మెఎ్‌సఎఫ్‌ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలంతా ప్రకటించారు.

Updated Date - Apr 14 , 2026 | 05:26 AM