Share News

తెగిన 14 లక్షల కోళ్లు, గొర్రెలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:17 AM

దర్శనాలు చేసుకున్నారు.. మొక్కులు తీర్చుకున్నారు.. కొత్త మొక్కులు మొక్కుకున్నారు. బెల్లం సమర్పించారు.. కొబ్బరికాయలు కొట్టారు.. జీవాలనూ బలిచ్చారు..

తెగిన 14 లక్షల కోళ్లు, గొర్రెలు

  • మేడారం మహాజాతరలో మద్యం, మాంసానికే రూ.350 కోట్ల మేర ఖర్చు

  • బెల్లం, కొబ్బరికాయలు, చీరె, సారెలకు 25 కోట్లు

  • తల్లుల వనప్రవేశం.. ముగిసిన మేడారం జాతర

వరంగల్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): దర్శనాలు చేసుకున్నారు.. మొక్కులు తీర్చుకున్నారు.. కొత్త మొక్కులు మొక్కుకున్నారు. బెల్లం సమర్పించారు.. కొబ్బరికాయలు కొట్టారు.. జీవాలనూ బలిచ్చారు.. ముక్క, చుక్కతో మజా చేసుకున్నారు. ఆ అనుభూతులన్నీ మనసులో నిక్షిప్తం చేసుకొని, ఇంటిబాట పట్టారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర భక్తకోటికి పండగే అయింది. నాలుగు రోజుల పాటు సాగిన జాతర శనివారంతో ముగిసింది. మహాజాతర సందర్భంగా వనదేవతలను దర్శించుకునేందుకు కోటిన్నర మందికిపైగా భక్తులు పోటెత్తారు. తెలుగురాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిసా, మధ్యప్రదేశ్‌ నుంచే కాకుండా విదేశాల నుంచీ ఈసారి భక్తులు మేడారానికి తరలివచ్చారు. వీరంతా జాతరలో వెయ్యికోట్లకుపైగా ఖర్చుచేసినట్లు అంచనా. నాలుగు రోజుల్లోనే సుమారు 4 లక్షలకుపైగా గొర్రెలు, మేకలు తల్లులకు బలిచ్చినట్లుగా అంచనా. గొర్రెకు సగటున రూ.8వేల చొప్పున లెక్కేసుకున్నా రూ.320 కోట్లు గొర్రెలకే ఖర్చుచేసినట్లు అంచనా. 10 లక్షల కోళ్లను జాతరలో భక్తులు ఆరగించినట్లుగా అంచనా. కోడి కిలోన్నర నుంచి రెండు కిలోల బరువు ఉంటాయి. జాతరలో కోడిని రూ.400 చొప్పున విక్రయించారు. ఈ లెక్కన కోళ్ల రూపంలోనే సుమారు రూ.40 కోట్లు భక్తులు ఖర్చు చేసినట్లు అంచనా. జాతరలో మద్యం ఏరులైపారింది.


ఎక్సైజ్‌ శాఖకు ఈ జాతరలో సుమారు రూ.4.50 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అంచనా. భక్తులు బయట నుంచి కూడా పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేసుకున్నారు. సుమారు మద్యం పేరిట రూ.10 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మాంసం, మద్యం పేరుతో సుమారుగా రూ.400 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా అంచనా వేస్తున్నారు. వీటితో పాటు లక్షల్లో కూల్‌డ్రింక్స్‌, వాటర్‌ బాటిళ్లు, పాన్‌, గుట్కా, సిగరెట్‌ భారీగా అమ్మకాలు జరిపారు. జాతరలో ఈసారి సుమారు 500 టన్నుల బెల్లాన్ని విక్రయించినట్లుగా అంచనా. జాతరలో కిలో బెల్లం రూ.70 చొప్పున విక్రయించారు. సుమారు రూ.3.50 కోట్ల బెల్లం జాతరలో ఖర్చు చేసినట్లుగా అంచనా. భక్తుల్లో చాలామంది సొంతూరు నుంచే బెల్లాన్ని తీసుకొచ్చి తల్లులకు సమర్పించారు. అలా మరో 500 టన్నుల బెల్లాన్ని భక్తులు తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. మొత్తంగా రూ.7కోట్లకుపైగా బెల్లంపై భక్తులు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. జంపన్న, నాగులమ్మ గద్దెల వద్ద, సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొడుతుంటారు. తలా నాలుగు కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అంటే కనీసం కోటికి పైగా కొబ్బరికాయలు విక్రయించినట్లుగా అంచనా. కొబ్బరికాయకు రూ.60 వేసుకున్నా రూ.60 కోట్ల మేర కొబ్బరికాయల వ్యాపారం జరిగినట్లుగా అంచనా. చీరె, సారె, గాజులు, ఒడిబియ్యం, తల్లులకు సమర్పించే కానుల రూపంలో మరో రూ.50 కోట్ల వరకు భక్తులు ఖర్చు చేసినట్లుగా అంచనా. ఇవేకాకుండా హోటళ్లు, ఎగ్జిబిషన్స్‌, తినుబండారాలు, ఆట వస్తువులు, బ్యాగులు తదితర షాపింగ్‌ల పేరుతో మరో రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లుగా అంచనా. భక్తులు అద్దె వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో మేడారానికి వచ్చారు.

Updated Date - Feb 01 , 2026 | 06:18 AM