Share News

వైఎస్‌ షర్మిల పేరుతో బెదిరింపులు

ABN , Publish Date - May 23 , 2026 | 05:04 AM

మాదాపూర్‌లోని సర్వే ఆఫ్‌ ఇండియా సొసైటీ నుంచి 1996లో భార్య, చెల్లెలు పేరిట తాను కొనుగోలు చేసిన స్థలంలో కొందరు వ్యక్తులు ఏపీ కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ..

వైఎస్‌ షర్మిల పేరుతో బెదిరింపులు

  • మాదాపూర్‌లో భూ ఆక్రమణ

  • బాధితుడు నర్సింగ్‌రావు ఆరోపణ

  • ఫిర్యాదు.. కేసు నమోదు

హైటెక్‌ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌లోని సర్వే ఆఫ్‌ ఇండియా సొసైటీ నుంచి 1996లో భార్య, చెల్లెలు పేరిట తాను కొనుగోలు చేసిన స్థలంలో కొందరు వ్యక్తులు ఏపీ కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ.. ఆక్రమణకు తెగబడ్డారని బాధితుడు పల్లెపు నర్సింగరావు ఆరోపించారు. సర్వే నం.11/19, 11/20లో తమకు చెందిన ఈ స్థలంలోకి అక్రమంగా చొరబడడమే కాకుండా సీసీ టీవీ కెమెరాలను, సరిహద్దులుగా ఏర్పాటు చేసుకున్న రేకులను ధ్వంసం చేశారని వాపోయాడు. రామారావు అనే వ్యక్తి వచ్చి ఈ స్థలంలో తనకు చెందిన భూమి ఉందంటూ ఘర్షణకు దిగుతున్నాడని ఆరోపించాడు. ఈ వివాదంలో సత్యం అనే వ్యక్తితో పాటు కరీంనగర్‌కు చెందిన సురేందర్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, ఆయన భార్య, కొడుకు ప్రమేయం కూడా ఉందన్నారు. రాజగోపాల్‌, సురేందర్‌రెడ్డిలు తరచూ తనను బెదిరిస్తూ.. వైఎస్‌ షర్మిల కార్యాలయానికి రమ్మంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. పైగా ఈ స్థలం షర్మిలదంటూ బోర్డులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పాడు. ఈ ఘటనపై బాధితుడు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు డీఐ విజయ్‌ నాయక్‌ తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 05:04 AM