కదిలింది జాతర బస్సు!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:49 AM
మరో ఐదురోజుల్లో మేడారం మహా జాతరకు తెరలేవనుంది. భక్తుల కోసం ఆర్టీసీ రాష్ట్రం నలుమూలల నుంచి 4వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.
మేడారానికి 4వేల ఆర్టీసీ బస్సులు.. ‘మహాలక్ష్మి’తో భక్తుల సంఖ్య పెరిగే ఛాన్స్
బస్సుల్లో ఈసారి 25 లక్షలమంది!
సేవల్లో 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది
50 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్
నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం
‘స్వచ్ఛ మేడారం’ విధుల్లో 6వేల మంది
ఒకే రోజు 3లక్షమంది భక్తుల రాక
హనుమకొండ టౌన్, వరంగల్ కార్పొరేషన్, తాడ్వాయి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మరో ఐదురోజుల్లో మేడారం మహా జాతరకు తెరలేవనుంది. భక్తుల కోసం ఆర్టీసీ రాష్ట్రం నలుమూలల నుంచి 4వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హనుమకొండ నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా ఆదివారం నుంచి అన్నిచోట్ల నుంచి బస్సులు బయలుదేరుతాయి. వనదేవతల గద్దెల వరకు భక్తులను చేర్చేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర సేవల్లో 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది పాల్గొననున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. గత జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 18లక్షల మంది భక్తులు హాజరవ్వగా ఈసారి 25 లక్షల మంది తరలివస్తారని ఆర్టీసీ అంచనా వేస్తోంది. మేడారంలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభిస్తారు. భక్తుల కోసం బస్టాండ్‌లో ప్రత్యేక క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, బస్సుల సమాచారం తెలిపే ఎల్‌ఈడీ స్ర్కీను వంటి వసతులు ఏర్పాటు చేశారు.
10కి.మీ మేర పారిశుధ్యం
ఈనెల 28 నుంచి 31వ తేదీ దాకా మేడారం జాతరలో భక్తులు ఇబ్బంది పడకుండా ‘స్వచ్ఛ మేడారం’ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహా జాతర సాగినన్నాళ్లూ 6వేల మంది పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉంటారు. వీరిలో మరుగుదొడ్ల శుభ్రత కోసమే 2వేల మందిని నియమించారు. 100 చెత్త తరలింపు వాహనాలు, 40 స్వచ్ఛ ఆటోలు, 1120 తోపుడుబండ్లు, 18 ఎక్స్‌కవేటర్లు, 5 స్వీపింగ్ యంత్రాలు పెట్టారు. పారిశుధ్య సిబ్బంది మూడు షిప్టుల్లో పనిచేస్తారు. పారిశుధ్య కార్మికుల కోసం మేడారం జాతరను 10 జోన్లుగా విభజించారు. జోన్‌కు 400 మంది కార్మికుల చొప్పున చుట్టూ 10 కి.మీ మేర విధుల్లో ఉంటారు. అయితే జాతర ముగిశాక 6వేలమందిని ఇళ్లకు పంపించి.. మరో 3వేల మందితో రోడ్ల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫినాయిల్ స్ర్పే చేయడం వంటి పనులతో మేడారం పరిసరాలను శుభ్రం చేయిస్తామని ఈ పనులను పర్యవేక్షిస్తున్న ములుగు డీఆర్‌వో వెంకటయ్య చెప్పారు. కాగా మహా జాతరకు ముందే మేడారం జనసంద్రమైంది. శుక్రవారం దాదాపు 3లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్నవాగు స్నాన ఘట్టాలు, కల్యాణకట్టలు, గద్దెల పరిసరాలు కిటకిటలాడాయి.
ఎల్‌ఈడీ నేమ్ స్టాండ్ కూలి..
మేడారం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఓ ఎల్‌ఈడీ నేమ్ స్టాండ్ కూలి మీదపడడంతో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎడ్ల నర్సయ్య అనే భక్తుడికి గాయాలయ్యాయి. గద్దెలపైకి భక్తులు విసిరిన ఓ కొబ్బరికాయ తగిలి ఏసీపీ నర్సయ్య గన్‌మెన్ వీరబ్రహ్మేంద్రచారి తలకు గాయమైంది. జంపన్నవాగులో పుణ్యస్నానం చేసేందుకు నీళ్లలో దిగిన ముగ్గురు భక్తులు నీట మునగగా.. ప్రత్యేక సిబ్బంది వారిని రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన ఏంఆర్ వినోద్ (58) అనే భక్తుడు మేడారంలో గుండెపోటుతో మృతిచెందాడు.
ఛత్తీ్‌సగఢ్ సీఎంకు ఆహ్వానం
మేడారం జాతరకు రావాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్ శుక్రవారం ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని ఆహ్వానించారు. రాయపూర్‌లోని సీఎం నివాసంలో విష్ణుదేవ్‌ను పూజారి సురేందర్ కలిశారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరుగుతుందని, తప్పకుండా రావాలని ఆహ్వానించారు.