Mulugu District: మేడారం మహాజాతరకు అంకురార్పణ
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:35 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర జరగనున్న నేపథ్యంలో వనదేవతల గుడి మెలిగె పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఘనంగా వనదేవతల గుడిమెలిగె పండుగ
కుటుంబ సమేతంగా నిర్వహించిన పూజారులు
తాడ్వాయి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహాజాతర జరగనున్న నేపథ్యంలో వనదేవతల గుడి మెలిగె పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఘట్టంతో మహాజాతర అంకురార్పణ జరిగింది. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ, పునుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులకు గ్రామాల్లోని గుడుల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున పూజారులు, వారి కుటుంబ సభ్యులు స్నానాలు చేసిన తర్వాత ఇల్లూ వాకిలి శుభ్రం చేసి దేవతల గుడుల వద్దకు చేరుకున్నారు. అడవి ప్రాంతాలకు కాలినడకన పూజారులు వెళ్లి గుట్టగడ్డి, పుట్ట మట్టిని తీసుకొచ్చారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ఆయా ఆలయాలను మహిళలు పుట్ట మట్టితో అలికారు. పురుషులు గుట్ట గడ్డితో గుడి పైకప్పులను వేశారు. రోజంతా ఉపవాసాలు చేసి తల్లుల గర్భగుడులను శుభ్రం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ నంతరం డోలు వాయిద్యాల నడుమ ఈ పండుగను వనదేవతల పూజారులు ఘనంగా నిర్వహించారు. దేవతలకు దీపధూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో మేడారం మహాజాతరకు పూజా తంతు మొదలైనట్టుగా ఆదివాసీలు భావిస్తా రు. నియమ నిష్ఠలతో పూజారులు జాతర ముగిసే వరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారులు మునీందర్, బొక్కన్న, కృష్ణయ్య, అరుణ్, రమేశ్, జనార్దన్.. సారలమ్మ పూజారులు కాక సార య్య, కిరణ్, వెంకన్న గ్రామస్థులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొనున్నారు.
50వేల మంది భక్తుల రాక
మేడారంలో భక్తుల ముందస్తు మొక్కుల సందడి కొనసాగింది. వనదేవతలకు ప్రత్యేక రోజు కావడంతో బుధవారం జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాత అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని ఆదివాసీలసంప్రదాయ పద్ధతుల్లో పసుపు, కుంకుమ, బంగారం(బెల్లం), నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు.