Share News

‘నా భోజనం తిని.. నాకే ద్రోహం చేస్తావా?’

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:12 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ భూమి స్వాధీనం, గెస్ట్‌హౌజ్‌, అపార్ట్‌మెంట్‌ కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ నేత...

‘నా భోజనం తిని.. నాకే ద్రోహం చేస్తావా?’

  • సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంఏ ముఖీం ఆగ్రహం

అమీన్‌పూర్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ భూమి స్వాధీనం, గెస్ట్‌హౌజ్‌, అపార్ట్‌మెంట్‌ కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ నేత, న్యాయవాది ఎంఏ ముఖీం స్పందించారు. తన తండ్రి ఎంఏ షరీఫ్‌తో కలిసి మాట్లాడిన ముఖీం.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద స్థలంలో ఎంఏ ముఖీం చేపట్టిన నిర్మాణాలను హైడ్రా శనివారం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పాత పరిచయంతో తన ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకుని గెలిపించాలని ప్రాధేయపడిన విషయం నిజం కాదా? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ఎంఏ ముఖీం ప్రశ్నించారు. కేవలం కక్షపూరితంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ‘నా ఇంట్లో భోజనం చేసి, నీళ్లు తాగి నాకే ద్రోహం చేస్తావా’ అని సీఎంపై ధ్వజమెత్తారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏకపక్షంగా ప్రభుత్వ భూమి అని తేల్చి చర్యలకు దిగడం సరికాదని అన్నారు. ప్రభుత్వం, హైడ్రా ఎన్ని కుట్రలు చేసినా న్యాయస్థానంపై నమ్మకంతో ముందుకు వెళతామని ముఖీం పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 06:28 AM