వామపక్ష తీవ్రవాదాన్ని మూలాలతో నిర్మూలించాం
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:38 AM
వామపక్ష తీవ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించాలనే లక్ష్యాన్ని తమ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని బలహీనపర్చాం
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): వామపక్ష తీవ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించాలనే లక్ష్యాన్ని తమ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల కట్టడి, సైబర్ భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ, నూతన న్యాయ చట్టాల అమలు, సమన్వయ భద్రత- అభివృద్థి వ్యూహం ద్వారా వామపక్ష ఉగ్రవాదాన్ని దాదాపు పూర్తిగా నిర్మూలించడంలో పురోగతి సాధించిందని వివరించారు. అలాగే, జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థను గణనీయంగా బలహీనపరిచామని చెప్పారు. సమగ్ర పాలన, అంతర్-ఏజెన్సీ సమన్వయం, లక్ష్యాధారిత అంతర్గత భద్రతా నిర్వహణ దిశగా జరిగిన విస్తృత మార్పు ద్వారా ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఐదో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్రభాయి రజనీకాంత్ పటేల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. భద్రత, స్వేచ్ఛ ఒకదానిని మరొకటి బలపరచేలా ఉండాలే తప్ప బలహీనపర్చకూడదని అన్నారు.