kumaram bheem asifabad- పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
ABN , Publish Date - Jul 26 , 2026 | 10:18 PM
సీజనల్ వ్యాధులతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగినంత లేకపోయినా అప్పుడప్పుడు కురుస్తున్న చిరు జల్లులు, వర్షాలకే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. దీనికి తోడు వ్యాధుల భయం వెంటాడుతోంది. అయినా కూడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
- దోమల వృద్ధితో ప్రజల అవస్థలు
కాగజ్‌నగర్ టౌన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : సీజనల్ వ్యాధులతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగినంత లేకపోయినా అప్పుడప్పుడు కురుస్తున్న చిరు జల్లులు, వర్షాలకే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. దీనికి తోడు వ్యాధుల భయం వెంటాడుతోంది. అయినా కూడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కనీసం పారిశుధ్య చర్యలు కూడా తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 335 గ్రామ పంచాయితీలతో పాటు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే వర్షాలకు రోడ్డు బురదమయంగా మారాయి. మండల, పట్టణ కేంద్రాల్లో డ్రైనేజీ వ్యవస్తగా అస్తవ్యస్తంగా మారింది. దీంతో నీరంతా రోడ్లుపై నిలిచి దోమల వృద్ధికి కారణమవుతోంది. దీనికి తోడు పారిశుధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌తో పాటు ఆయా శాఖలు సమన్వయంతో పని చేస్తేనే వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 434 రెవెన్యూ గ్రామాల్లో అంతటా ఇదే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 220 మంది పారిశుధ్య సిబ్బంది ఉన్నారు. వీరు ఆయా వార్డుల్లో 20 వాహనాలు ద్వారా పారిశుధ్య పనులు చేపడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మెరుగుపడడం లేదని అంటున్నారు. దీంతో వర్షాలకు మున్సిపాల్టీలో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాటు జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, దహెగాం, సిర్పూర్ (టి), చింతలమానెపల్లి, కాగజ్‌నగర్ మండలాల్లో అధికంగా రోడ్లు చిత్తడిగా మారడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది.
- పారిశుధ్య నిర్వహణతోనే
పారిశుద్య నిర్వహణ మెరుగుపడితేనే వ్యాధుల కట్టడి సాధ్యమవుతుందని, వర్షాలు భారీగా కురిస్తే మరింత ఇబ్బందులు తలెత్తుతాయని ప్రజలు పేర్కొంటున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత ఉండడం తోడు పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల చెత్తచెదారం రోడ్లపై వర్షం నీటితో జలమయంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో ముప్పుకు ముందే బ్లీచించ్ పౌడర్, ఇతర పారిశుద్య పనులు చేపట్టాల్సి ఉంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని 50 వార్డుల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో డెంగీ, డయేరియా, మలేరియా కేసులు ప్రతీ యేట నమోదు అవుతున్నాయి. అంటు వ్యాధులు ప్రబలకముందే ఆయా ప్రాంతాలపై దృష్టి సారించి వ్యాధులు పెరగకుండా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఖాళీ స్థలాల్లో, దోమలు ఆవాసాలుగా మారే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచి వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. బాలాజీ నగర్, ద్వారకా నగర్, కాపువాడ, సర్‌సిల్క్ ఏరియా, బాలాజీ నగర్, సంఘం బస్తీ, సంజీవయ్య కాలనీ, మార్కెట్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో పారిశుఽధ్యం అస్తవ్యస్తంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో మురికి కాలువలు లేకపోవడంతో అస్తవ్యస్త పరిస్తితులున్నాయి. సంజీవయ్య కాలనీ, ఆదర్శనగర్, కాపువాడ, సర్‌సిల్క్ ఏరియాతో పాటు పెట్రోల్ పంపు నుంచి నౌగాం బస్తీ, తీరందాజ్ టాకీస్ ఏరియా, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ప్రతీ ఏటా వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఈసారి ముందస్తుగా నాలాల్లో పూడిక తీత పనులు కూడా కొనసాగించలేదని అంటున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలు కావడంతో చెత్త పేరుకు పోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇందిరా మార్కెట్ తో పాటు, సర్‌సిల్క్ ఎల్‌బీఎస్ మార్కెట్‌లోని కూరగాయలు, మటన్ మార్కెట్‌లో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.