హైదరాబాద్‌లో మరో కొత్త జీసీసీ
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:06 AM
హైదరాబాద్‌లో మరో కొత్త జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ఏర్పాటైంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం, ఫార్చూన్ 500 కంపెనీల్లో ..
3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
వర్చువల్‌గా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మరో కొత్త జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) ఏర్పాటైంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం, ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటైన ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ బుధవారం హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ప్రెస్టీజ్ స్కై టెక్‌లో 3 లక్షల చ.అడుగుల్లో తన జీసీసీని లాంఛనంగా ప్రారంభించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ తమ జీసీసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ‘ఇవాళ ఏర్పాటైంది కేవలం మరొక కొత్త జీసీసీ మాత్రమే కాదు.. హైదరాబాద్‌పై పారిశ్రామికవేత్తలకున్న నమ్మకం కూడా’ అని చెప్పారు. ‘మీరు మీ కంపెనీని విస్తరించండి.. మా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టండి’ అని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపే చూస్తోందన్నారు.