Share News

ఇంట్లో ఒకటి.. భయంతో మరొకటి!

ABN , Publish Date - Mar 14 , 2026 | 06:05 AM

వంటగ్యాస్‌ (ఎల్పీజీ) సిలిండర్ల కోసం రాష్ట్రంలో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు.

ఇంట్లో ఒకటి.. భయంతో మరొకటి!

  • పెరిగిపోతున్న గృహ వినియోగ గ్యాస్‌ బుకింగ్‌లు

  • యుద్ధంతో కొరత పెరుగుతుందని ముందు జాగ్రత్తలు

  • ఆలయాల్లో అన్నదానాలు వాయిదా.. ప్రసాదాల కుదింపు

  • ఎల్పీజీ లేక కొన్ని ప్రాంతాల్లో మూతపడుతున్న హోటళ్లు

  • కట్టెల పొయ్యిలు, బొగ్గు బట్టీలపై వంటలు

  • హైదరాబాద్‌లో పొయ్యి కట్టెలకు కూడా కటకట

  • ఐటీ ఉద్యోగులకు భోజనం కష్టాలు.. గ్యాస్‌ కొరత తీరేవరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని డిమాండ్లు

  • ఎల్పీజీ సరఫరా కొనసాగుతుందన్న అధికారులు

  • సిలిండర్ల సరఫరా లారీలకు పోలీసు బందోబస్తు

  • ఎల్పీజీ కొరత నివారణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు

  • అత్యవసర సేవలకు గ్యాస్‌ కొరత లేకుండా చూస్తామన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): వంటగ్యాస్‌ (ఎల్పీజీ) సిలిండర్ల కోసం రాష్ట్రంలో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ దిగుమతులకు అంతరాయం కలగటంతో వంటగ్యా్‌సకు ఇప్పటికే కొరత ఏర్పడింది. ఇది మరింత తీవ్రమవుతుందేమోన్న భయంతో చాలామంది ఇళ్లలో ఫుల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఉన్నా.. మళ్లీ మరోదాని కోసం బుక్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌లలో బుకింగ్‌లు కాకపోవటంతో సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ముందుజాగ్రత్తగా గ్యాస్‌ సిలిండర్లు రవాణా చేసే వాహనాలకు బందోబస్తు కల్పించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. మరోవైపు కొన్నిచోట్ల పెట్రోల్‌ బంకుల్లో కూడా నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కమర్షియల్‌ గ్యాస్‌కు మరింత కొరత ఏర్పడటంతో పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని ఆలయాల్లో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూప్రసాదాలు అందిస్తున్నారు. వంటగ్యా్‌సకు ప్రత్యామ్నాయమైన ఇండక్షన్‌ స్టౌలు, రైస్‌ కుక్కర్లకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. హోటళ్లు, శుభకార్యాల్లో కట్టెల పొయ్యిల వాడకం పెరగటంతో హైదరాబాద్‌లో కట్టెలకు కూడా కటకట ఏర్పడుతోంది. హైదరాబాద్‌లో డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లు సుమారు 40 లక్షలు ఉండగా, వాణిజ్య కనెక్షన్లు లక్ష వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో గ్యాస్‌ బుకింగ్‌కు సమస్యలు ఏర్పడుతుండటంతో కొందరు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల వద్దకు పరుగెడుతున్నారు. వెంటనే సిలిండర్‌ కావాలని ఏజెన్సీల నిర్వాహకుల తో వాగ్వాదానికి దిగుతున్నారు.

1.jpg

4.jpg


అన్నదానాలకు గ్యాస్‌ కొరత

ఎల్పీజీ కొరత ప్రభావం పలు దేవాలయాల్లో అన్నదానాలు, ప్రసాదాల పంపిణీకి సైతం తాకింది. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం, జూబ్లీహిల్స్‌ టీటీడీ ఆలయం, సికింద్రాబాద్‌ గణేష్‌ తదితర ఆలయాల్లో ప్రసాద విక్రయాలు కుదించాలని నిర్ణయించారు. ఉప్పల్‌ స్వరూ్‌పనగర్‌లోని కనిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం సుమారు 1,500 మందికి అన్నదానం చేస్తుంటారు. గ్యాస్‌ కొరతతో దీనిని నిలిపివేశారు. జూబ్లీహిల్స్‌ టీటీడీ దేవాలయంలో శనివారం నుంచి అన్నదానం, ఆదివారం నుంచి అల్పాహారం నిలిపివేయనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని స్వర్ణ దేవాలయంలో అన్నదానం యధావిధిగా జరుగుతుందని హరే కృష్ణ మూవ్‌మెంట్‌ నిర్వాహకులు ప్రకటించారు. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో కట్టెల పొయ్యిపై ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో కూడా ఎల్పీజీ కొరత తీవ్రమవుతోంది. పలు హోటళ్లలో కట్టెల, బొగ్గుల కుంపటితో వంటలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని గ్యాస్‌ ఏజెన్సీల ముందు శుక్రవారం వినియోగదారులు భారీగా బారులు తీరారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో శుక్రవారం నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి

బ్రికెట్స్‌కు భలే గిరాకీ

ఎల్పీజీ కొరతతో కొన్నిచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల కట్టెలు, బొగ్గు పొయ్యిలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో బ్రికెట్స్‌ (బయో డీగ్రేడబుల్‌ వ్యర్థాలతో తయారు చేసిన ఇంధనం)కు, వాటిని వినియోగించే స్టౌవ్‌లకు గిరాకీ పెరుగుతోంది. వ్యవసాయ వ్యర్థాలను పొట్టుగా మార్చి ఓ యంత్రంలో గట్టిగా కుదించి వివిధ సైజుల్లో బ్రికెట్స్‌గా తయారు చేస్తారు. మామూలు రోజుల్లో కిలో బ్రిగెట్స్‌ ధర రూ.10 ఉండగా, ప్రస్తుతం రూ.16 వరకు పెరిగింది. హైదరాబాద్‌ శివార్లలో ఉన్న 30కి పైగా పరిశ్రమలు రోజుకు రెండు వేల టన్నుల బయోమాస్‌ బ్రికెట్లను తయారు చేస్తున్నాయి. బ్రికెట్స్‌ను వాడటం ద్వారా సుమారు 75 శాతం ఎల్పీజీని ఆదా చేయవచ్చని, 19 కేజీల సిలిండర్‌ 60 కిలోల బ్రికెట్స్‌కు సమానమని బాలానగర్‌లోని శ్రీ ఇంజనీరింగ్‌ సంస్థ ఇన్‌చార్జి ఏ. సుబ్బారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ హాస్టళ్లలో గత 4 రోజులుగా వంటల కోసం కట్టెల పొయ్యిలని వినియోగిస్తున్నారు.

3.jpg


2.jpg

హైదరాబాద్‌లో కొట్టెల కొరత

ఎల్పీజీ కొరతతో హోటళ్లతోపాటు శుభకార్యాల్లో కూడా కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టడంతో హైదరాబాద్‌లో కట్టెలకు కూడా కొరత ఏర్పడింది. ఇప్పటికే కట్టెల దుకాణాల్లో ఉన్న స్టాక్‌ అయిపోవచ్చింది. దీంతో కట్టెలను పంపాలని బడా వ్యాపారులను కోరినా పంపటం లేదని దుకాణాల యజమానులు చెబుతున్నారు. నగరంలో వందకు పైగా పొయ్యి కట్టెలు విక్రయించే షాపులు ఉన్నాయి. వీటికి రోజూ 500 టన్నులకు పైగా పొయ్యి కట్టెలు దిగుమతి ఆవుతుంటాయి. ప్రస్తుతం డిమాండ్‌ పెరగటంతో ఆ మేరకు సప్లై చేయలేకపోతున్నామని బడా వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కిలో కట్టెలు రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ముషీరాబాద్‌లో గత 40 ఏళ్లుగా కట్టెల విక్ర యిస్తున్నానని, ఇంత డిమాండు ఎప్పుడూ లేదదని కట్టెల వ్యాపారి భాస్కర్‌ తెలిపారు.

మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..!

హైదరాబాద్‌లో కొన్నివందల మంది ఐటీ ఉద్యోగులు పేయింగ్‌ గెస్ట్‌లుగా ఉంటున్నారు. మరికొందరు బ్యాచిలర్‌ రూముల్లో ఉంటూ కంపెనీ క్యాంటీన్లపైఆధారపడుతున్నారు. ఎల్పీజీ కొరత వీరికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. క్యాంటీన్లలో ఉప్మా, పులిహోరలాంటి ఒకటి రెండు పదార్థాలే అందిస్తున్నారని, హోటల్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంటోందని మాదాపూర్‌లో పేయింగ్‌ గెస్టుగా ఉంటున్న ప్రసాద్‌ అనే ఐటీ ఉద్యోగి ఆవేదన వ్యక్తంచేశారు. గ్యాస్‌ కొరత తీరేవరకు కంపెనీలు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పిస్తే సొంతూళ్లకు వెళ్లి హాయిగా ఇంటి వంట తింటూ ఉత్సాహంగా పనిచేస్తామని కొందరు టెకీలు అంటున్నారు. బెంగుళూరు, చెన్నైలోని కొన్ని ఐటీ కంపెనీలు ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సరైన మార్గమని వెల్స్‌ఫార్గో వైస్‌ప్రెసిడెంట్‌ కె. చంద్రశేఖర్‌ సూచించారు. దీనివల్ల పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

భయం వద్దు.. నిల్వలు ఉన్నాయి

హైదరాబాద్‌ జిల్లాలో డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్యాస్‌ ప్లాంట్ల ప్లాంట్ల వద్ద తగినన్నీ నిల్వలు ఉన్నాయి. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. వినియోగదారులు ఆందోళనకు గురికావద్దు. డొమెస్టిక్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడాన్ని అరికట్టేందుకు దాడులు చేస్తున్నాం. ఇప్పటివరకు అత్యవసర వస్తువుల చట్టం 1955లోని సెక్షన్‌ 6-ఏ కింద 233 కేసులు నమోదు చేశాం. అలాగే 381 డొమెస్టిక్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం.

- రాజిరెడ్డి, హైదరాబాద్‌ జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌

Updated Date - Mar 14 , 2026 | 06:58 AM