Share News

ఎల్పీజీ సిలిండర్ల స్టాక్‌ ఉంది.. ఆందోళన వద్దు

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:59 AM

గృహ ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి రాష్ట్రంలో సరిపడా స్టాక్‌ ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

ఎల్పీజీ సిలిండర్ల స్టాక్‌ ఉంది.. ఆందోళన వద్దు

  • గృహ వినియోగదారులకు మంత్రి ఉత్తమ్‌ భరోసా

  • అదనపు వాణిజ్య సిలిండర్ల కోసం కేంద్రానికి లేఖ

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): గృహ ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి రాష్ట్రంలో సరిపడా స్టాక్‌ ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సిలిండర్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయంలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో 1.3 కోట్ల మంది ఎల్పీజీ గృహ వినియోగదారులుండగా, 11 లక్షలు ఉజ్వల పథకంలో, 28 లక్షలు దీపం పథకం కింద కనెక్షన్లు ఉన్నాయన్నారు. ప్రతినెల 60 లక్షల దాకా గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. యుద్ధం కారణంగా రోజుకు 2.5 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, 2 రోజులుగా ఈ సంఖ్య మరింత పెరిగిందన్నారు. రాష్ట్రంలో 7.5 లక్షల దాకా వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులున్నారని, రోజుకు 23వేల వాణిజ్య సిలిండర్లు సరఫరా కావాల్సి ఉండగా, కొరత కారణంగా 6200 మాత్రమే సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు. అదనంగా వాణిజ్య సిలిండర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 06:11 AM