kumaram bheem asifabad- లోలెవల్ వంతెనలు.. ప్రయాణ కష్టాలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:13 PM
మారుమూ ల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజలు వాగు దాటే సమయంలో గిరిజనుల బాధలు వర్ణనాతీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి.
- రోజుల తరబడి బాహ్య ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామాల ప్రజలు
బెజ్జూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మారుమూ ల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజలు వాగు దాటే సమయంలో గిరిజనుల బాధలు వర్ణనాతీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి. మండలంలోని కుష్నపల్లి-సోమిని గ్రామాల మధ్య రెండు లో లెవల్ వంతెనలపై హైలెవల్ వంతెనలు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది. ఆయా గ్రామాల మధ్య రెండు వంతెనల నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 2014లో సుశ్మీర్ సమీపంలో ఒర్రెపై వంతెన నిర్మాణానికి రూ.2.15కోట్లు, కుష్నపల్లి సమీపంలో వంతెన కోసం రూ.2.10కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ వంతెనల నిర్మాణానికి అటవీ అనుమతులు లేవన్న కారణంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వంతెనలు లేక దాదాపు 10గ్రామాల గిరిజ నులు అనేక అవస్థలు పడుతున్నారు.
- మంజూరైన నిధులు వెనక్కి..
కుష్నపల్లి-సోమిని గ్రామాల మద్య వంతెనల నిర్మాణానికి మంజూరైన నిఽఽధులు గత ఏడాది వెనక్కి మళ్లాయి. ఈ రెండు వంతెనలు లేక సుశ్మీర్, సోమిని, మొగవెల్లి, పాతసోమిని, గెర్రెగూడ, నాగేపల్లి, బండల గూడ, ఇప్పలగూడ తదితర గ్రామాల ప్రజలకు ప్రతీ ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలోనైతే వారు పడే బాదలు చెప్పదలిచినవి కావు. కనీసం వైద్యానికి వెళ్లాలంటే చుట్టూ వాగుల కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి. వాగులు ఉప్పొంగినప్పుడల్లా బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి అవస్థలు పడుతున్నారు. నిఽధులు మంజూరై దాదాపు పదేళ్లు కావడంతో పనులు చేపట్టక కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వచ్చిన నిధులను వెనక్కి తీసుకుంది. దీం తో వారి కష్టాలు షరా మామూలే. గతంలో పలువు రు గర్భిణులు వాగుల కారణంగా కాన్పు కోసం అవ స్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. నాగేపల్లి గ్రామానికి చెందిన ఓ గర్బిణీ వాగు కారణంగా కాన్పు కోసం బయటకు వెళ్లలేక, వైద్యం అందక మృత్యువాత పడింది. అయినా ప్రభుత్వం వంతెనల విషయంలో చొరవ చూపలేక పోయిందని గిరి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- దశాబ్దాలుగా తిప్పలే..
వాగు అవతల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తిప్పలు పడుతూనే ఉన్నారు. వాగులపై వంతెనలు నిర్మించకపోవడంతో ఎటు వెళ్లాలన్నా వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఆ గ్రామాలకు వెళ్లేందుకు అవస్థలు తప్పవు. కనీసం 108 వాహనం కూడా వెళ్లలేని స్థితి నెలకొంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడితే దేవుడిపై భారం వేయాల్సిందే. వంతెనల నిర్మాణాలకు వచ్చిన నిధులు కూడా వెనక్కి మల్లడంతో ఆయా గ్రామాల ప్రజలకు ఇక వంతెనల ఏర్పాటు కలగానే మిగిలింది. వంతెనల నిర్మాణానికి అప్పట్లో నిధులు మంజూరు కాగా ఎంతో సంతోషపడ్డ ప్రజలకు ఇప్పుడు నిధులు వెనక్కి వెళ్లడం చేదు జ్ఞాపకంగా మారింది.