ప్రేమ వివాహం విషాదాంతం
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:37 AM
కులాలు వేరైనా ఒకే గ్రామానికి చెందిన వారిద్దరూ ప్రేమించుకున్నారు. తమకు వివాహం చేయాలని యువతి కుటుంబీకులను కోరగా, వారు తిరస్కరించటంతో పెద్దలను ఎదిరించి మూడు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
నవ వరుడి బలవన్మరణం
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం
భార్యను బలవంతంగా తీసుకెళ్లటంతో మనస్తాపం
సూర్యాపేట జిల్లాలో ఘటన
మునగాల, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కులాలు వేరైనా ఒకే గ్రామానికి చెందిన వారిద్దరూ ప్రేమించుకున్నారు. తమకు వివాహం చేయాలని యువతి కుటుంబీకులను కోరగా, వారు తిరస్కరించటంతో పెద్దలను ఎదిరించి మూడు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి కుటుంబీకులు తన భార్యను బలవంతంగా తీసుకువెళ్లారనే మనస్తాపంతో నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఏఎ్‌సఐ వెంకటరత్నం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆకుపాముల గ్రామానికి చెందిన చట్టు కోటేశ్వరరావు(27) అదే గ్రామానికి చెందిన యువతి ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ వివాహానికి అనుమతి ఇవ్వాలని యువతి కుటుంబ సభ్యులను కోటేశ్వరరావు కోరగా, వారు నిరాకరించారు. దీంతో ఈ నెల 19వ తేదీన కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలోని శివాలయంలో వివా హం చేసుకుని విజయవాడ వెళ్లారు. విజయవాడ నుంచి 21వ తేదీన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చేరుకుని అక్కడ షాపింగ్ చేశారు. ఈ క్రమంలో ఆకుపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ వీరిద్దరినీ చూసి యువతి కుటుంబానికి సమాచారమిచ్చింది. వెంటనే యువతి తండ్రి జానీమియా, ఎస్‌కే రషీద్, కేశగాని ఆంజనేయులు, ఇస్మాయిల్ ఆటోలో జగ్గయ్యపేటకు చేరుకుని యువతిని బలవంతంగా ఆకుపాముల గ్రామానికి తీసుకువచ్చారు. తన భార్యను బలవంతంగా తీసుకువెళ్లారన్న మనస్తాపంతో కోటేశ్వరరావు ఆకుపాముల గ్రామంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు ముందుకు అందుకుగల కారకుల పేర్లను కోటేశ్వరరావు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసినట్లు గుర్తించారు. కోటేశ్వరరావు తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని, గ్రామంలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావు తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా, తల్లి వ్యవసాయ కూలి పనులు చేస్తుండగా, ఆమెకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.
భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంపతో..
నిడమనూరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలకేంద్రంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రంలోని సాయినగర్ కాలనీలో నివాసముంటున్న కమ్మంపాటి శ్రీను(40) రోడ్డు నిర్మా ణం కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి పెద్దవూర మండ లం కొత్తలూరు గ్రామానికి చెందిన లక్ష్మితో 16 ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో రెండు నెలల కిత్రం భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. మస్తాపానికి గురైన శ్రీను సోమవారం తన గదిలో నుంచి బయటకు రాలేదు. శ్రీను తల్లి, వదిన ఎంతపిలిచినా మధ్యాహ్నం వరకు కూడా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి గోడ నుంచి రెండు ఇటుకలు తీసి చూడగా గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. పో లీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థ లానికి వచ్చిన పోలీసులు గది తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీను తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.