Share News

రైతన్న లోడెత్తేదెలా?

ABN , Publish Date - May 26 , 2026 | 04:31 AM

రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్న నేఫథ్యంలో.. లారీల కొరత సమస్యగా మారింది. ట్రాన్స్‌పోర్టు (రవాణా) కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు సరఫరా ..

రైతన్న లోడెత్తేదెలా?

  • కొనుగోలు కేంద్రాల్లో తీవ్రంగా లారీల కొరత

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్న నేఫథ్యంలో.. లారీల కొరత సమస్యగా మారింది. ట్రాన్స్‌పోర్టు (రవాణా) కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు సరఫరా చేయకపోవడంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో లోడు ఎత్తలేకపోతున్నారు. దీని ప్రభావం పంట ఉత్పత్తుల సేకరణపై కూడా పడుతోంది. రైతులు వారం, పది రోజులు లారీల కోసం ఎదురుచూడలేక బహిరంగ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు.. అందులో 30 శాతం లారీలను కూడా అందుబాటులో ఉంచడంలేదు. కొనుగోలుకేంద్రాలకు లారీలు తెప్పించాలని రైతులు ఎంత ఒత్తిడి చేస్తున్నా అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. యాసంగిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 75 లక్షల టన్నుల ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కజొన్నలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, సేకరణ మందకొడిగా సాగడంతో రైతులు ప్రైవేటు మార్కెట్లో ఎక్కువగా అమ్ముకున్నారు. అయితే టార్గెట్‌ తగ్గటానికి, కొనుగోళ్లు మందగించటానికి ప్రధాన కారణం.. లారీల సమస్యేనని చెబుతున్నారు. సకాలంలో లారీలు రాకపోవడం, ధాన్యం లోడు ఎత్తకపోవడం, రైస్‌మిల్లుల్లో దిగుమతి చేయకపోవడంతో.. రైతులు విసిగిపోయి తమ ధాన్యాన్ని ప్రైవేటు మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దీంతో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గిపోయింది. 90 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా, తాజాగా ఈ లక్ష్యాన్ని 75 లక్షల టన్నులకు తగ్గించుకుంది. లారీలు రాకపోవటంతో.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులంతా నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రం వరకు పంట ఉత్పత్తులను తీసుకురావడం వరకే రైతుల బాధ్యత ఉంటుంది. కానీ, వడ్ల లోడెత్తేవరకు, అవి రైస్‌మిల్లులు, గోదాముల్లో దిగుమతి అయ్యేవరకు రైతులనే బాధ్యులను చేస్తున్నారు.


కాగితాలపైనే వాహనాల లెక్కలు..

ధాన్యం రవాణాకు 13,200 వాహనాలను అందుబాటులో ఉంచినట్లు, లారీలు, డీసీఎంలతోపాటు ట్రాక్టర్లను కూడా రవాణాకు ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లెక్కలు చెబుతోంది. మార్క్‌ఫెడ్‌ కూడా మక్కల రవాణాకు జిల్లాస్థాయిలో ట్రాన్స్‌పోర్టు టెండర్లను పిలిచింది. ఏ జిల్లాలోనూ అగ్రిమెంటుకు అనుగుణంగా లారీల సరఫరా జరగటంలేదు. ఒప్పందం కుదుర్చుకున్న వాహనాల సంఖ్యలో... కేవలం 30-40 శాతం వాహనాలు కూడా కాంట్రాక్టర్లు సరఫరా చేయటంలేదు. వాహనాల సంఖ్య కాగితాలపై భారీగా కనిపిస్తున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం స్వల్ఫంగా ఉంది. ధాన్యం, మక్కల సేకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో... అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా లారీలు తెప్పించి రవాణా చేయించాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వం నుంచి ఆ ప్రయత్నాలేవీ జరగలేదు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి మసాలా దినుసుల లారీలు తెలంగాణకు వస్తున్నాయి. ధనియాలు, జీలకర్ర, ఆలుగడ్డ లోడ్‌లతో వస్తున్న లారీలు.. వాటిని దిగుమతి చేసిన తర్వాత జగిత్యాల మామిడి మార్కెట్‌కు వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు మామిడి కాయలను లోడ్‌ చేసుకొని తీసుకెళ్తున్నాయి. దీంతో మామిడి రైతులకు కాస్త ఉపశమనం లభిస్తోంది. కానీ, ధాన్యం, మక్క రైతులకు మాత్రం లారీల కొరతతో నిద్రపట్టడంలేదు. జూన్‌ 15 తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మామిడి ఎగుమతిదారులు చెబుతున్నారు. కానీ, అప్పటివరకు మక్క, ధాన్యం రైతులు ఎదురుచూసే పరిస్థితిలేదు. సొంత డబ్బు వెచ్చించి లారీలు తీసుకొద్దామని రైతులు భావించినా.. దొరకడంలేదు.

Updated Date - May 26 , 2026 | 04:31 AM