Share News

ఆటోను ఢీకొట్టిన లారీ

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:55 AM

నిలిపి ఉంచిన ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌ సహా ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటోను ఢీకొట్టిన లారీ

  • ముగ్గురు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

చింతపల్లి/నాంపల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నిలిపి ఉంచిన ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌ సహా ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషా ద ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వస్త్రాంతండా సమీపంలో జరిగింది. చింతపల్లి మండలం కొర్రమాన్సింగ్‌ తండాకు చెంది న కొర్రా బద్యానాయక్‌(57) 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం కొండమల్లేపలిలో సంత ఉండడంతో 12 మంది ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో వస్త్రాంతండా వద్ద ప్రయాణికులను దించుతుండగా, హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్యానాయక్‌, ఏపీలోని బాపట్లకు చెందిన బండారు ఇసాక్‌(55), బిహార్‌కు చెందిన సంతోష్‌ ఖలీఫా(40) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురి (రమావత్‌ అంబాలి, అంబో తు జంకు, వడ్త్యా అచ్చాలి, రమావత్‌ నల్ల, కొర్ర సరోజ) పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి ఎస్సై లింగారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన బిహార్‌కు చెందిన సంతోష్‌ ఖలీఫా, బాపట్లకు చెందిన ఇసాక్‌ ఇద్దరూ వలస కూలీలు. వీరు చింతపల్లి మండలం నర్సర్లపల్లిలోని ఓ కోళ్లఫాంలో పని చేస్తున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 04:55 AM