లారీ-బస్సు మధ్య నలిగిన ప్రాణాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:32 AM
సహచర డ్రైవర్లు ఎవరితోనో ఘర్షణ పడుతున్నారని వారించేందుకు వెళ్లి ఇద్దరు బస్సు డ్రైవర్లు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముందు బస్సు, వెనక లారీ రోడ్డుపై నిలిపి ఉండగా..
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
లారీ, బస్సు మధ్య ఇరుక్కుని ఇద్దరి మృతి
లారీ డ్రైవర్ అతివేగం.. అజాగ్రత్తతో ప్రమాదం
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఘటన
నార్కట్‌పల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సహచర డ్రైవర్లు ఎవరితోనో ఘర్షణ పడుతున్నారని వారించేందుకు వెళ్లి ఇద్దరు బస్సు డ్రైవర్లు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముందు బస్సు, వెనక లారీ రోడ్డుపై నిలిపి ఉండగా.. వేగంగా వచ్చిన మరో లారీ.. వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు-లారీ మధ్య ఇరుక్కొని మృతి చెందారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లికి శివారులో ఉన్న ఫ్లైఓవర్‌పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ పందిరి విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మోజో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఎన్‌ఎల్02-3119 నెంబర్ గల బస్సు హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో కాకినాడకు వెళ్తోంది. అదే దారిలో రాజమండ్రి వైపు వెళ్తున్న జీజే16ఏడబ్ల్యూ-5757 నెంబర్ గల లారీ ఒకదానికొకటి దాటి వెళ్లే సమయంలో స్వల్పంగా తగిలాయి. దీంతో బస్సు, లారీ డ్రైవర్లు తమ వాహనాలను రహదారి పక్కగా నిలిపి రెండు వాహనాల మధ్య నిలుచుని వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో కాకినాడకే వెళ్తున్న మోజో ట్రావెల్స్‌కే చెందిన ఎన్‌ఎల్02-3126 నెంబర్ గల బస్సు ఈ ప్రదేశానికి చేరుకుంది. తమ సంస్థకు చెందిన బస్సు డ్రైవర్‌తో ఓ లారీ డ్రైవర్ వాగ్వాదం చేస్తుండటాన్ని గమనించిన ఈ బస్సు డ్రైవర్లు హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన శ్రీనివాస్(30), కాకినాడకు చెందిన బంగారయ్య (44) తమ వాహనాన్ని పక్కకు నిలిపి వారివద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఇంతలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న ఏపీ 31టీహెచ్-1289 నెంబర్ గల మరో లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మోజో బస్సు-లారీ మధ్యన నిల్చుని మాట్లాడుతున్న శ్రీనివాస్, బంగారయ్య రెండు వాహనాల మధ్య నలిగి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎన్‌ఎల్02-3119 బస్సు డ్రైవర్లు సురక్షితంగా పక్కకు తప్పించుకోగా, ఇదే బస్సు క్లీనర్ సురే్‌షకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందగానే సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణుమూర్తి తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని అవసరమైన చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.