శ్రీరాముడి అలంకరణలో నారసింహుడు
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:30 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనృరసింహ స్వామి దివ్యక్షేత్రంలో పాంచరాత్రాగమన రీత్యా పాంచహ్నిక, పంచకుండాత్మక వార్షిక జయంత్యుత్సవాలు బుధవారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి.
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృరసింహ స్వామి దివ్యక్షేత్రంలో పాంచరాత్రాగమన రీత్యా పాంచహ్నిక, పంచకుండాత్మక వార్షిక జయంత్యుత్సవాలు బుధవారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. సాయంత్రం ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, అర్చక, పండిత బృందం వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా స్వామిని శ్రీరాముడు అలంకరణలో ఊరేగుతూ తిరువీధుల్లో భక్తులు దర్శనమిచ్చారు. అనంతరం సాయమారాధన, ద్వారతోరణపూజ, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడమూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నిర్వహించిన వేడుకల్లో భాగంగా స్వామివారి తిరువీధి సేవ ద్వారా ఆలయ ప్రవేశం చేయిం చారు. యాగశాలలో ద్వారతోరణపూజ, మూర్తికుంభారాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాతగుట్టలోనూ మూడో రోజు వేడుకల్లో భాగంగా యాగశాలలో ప్రాతరరాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, నిత్యపూర్ణాహుతి, లక్ష కుంకుమార్చన సాయంత్రం సాయమారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈవో జే. భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్క రాయణీ నరసింహమూర్తి, డీఈవో ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, ఏఈవో జాటోతు శంకర్‌నాయక్, పర్యవేక్షకులు కలకోట సీతరామచార్యులు, దొమ్మాట సురేందర్‌రెడ్డి, మాచర్ల రాజన్‌బాబు, వాసం వెంకటేశ్వర్లు, దాసోజు నరేష్, ఎస్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ కే. శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
నేటితో జయంత్యుత్సవాలు పరిసమాప్తి
స్వామి జయంత్యుత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామి సేవలో యాగశాల ప్రవేశం, ద్వారతోరణపూజ, మూర్తికుంభారాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు నిర్వహిస్తారు. నిత్య పూర్ణాహుతి, సాయంత్రం శ్రీరామ అలంకరణలో తిరువీధి సేవ, సాయమారాధన, ద్వారతోరణ పూజ, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, 10 గంటలకు ద్వారతోరణ మషబలి, మహా పూర్ణాహుతి, ఏకోత్తర సహస్ర కలశాభిషేకం, సాయంత్రం అర్చన, వేదస్వస్తి, నృసింహ ఆవిర్భావం, రుత్విక్ సన్మానం, మహా నివేదన, తీర్థ ప్రసాదగోష్టితో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. పాతగుట్టలోనూ యాగశాలలో చతుఃస్థానార్చన లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర మంత్ర హోమాలు, మహా పూర్ణాహుతి, అష్టోత్తర శతాఘటాభిషేకం (భక్తులచే అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహిస్తారు) సాయంత్రం సాయమారాధన, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్టితో ఉత్సవ పరిసమాప్తి అవుతాయి. .
శాస్త్రోక్తంగా ఆస్థాన పూజలు
స్వామి దివ్యక్షేత్రంలో ఆస్థాన పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వామి అమ్మ వారిని మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తుల ను అభిషేకరించి తులసీదళాలతో సహస్రనార్చనలు నిర్వహించారు. సాయంత్రం ముఖ మండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు వెండిజోడు సేవలు, సహస్రనార్చనలు నిర్వహించారు. పాత గుట్టలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. శివాలయంలో పర్వ తవర్థిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.14,18,066 ఆదాయం సమకూరినట్లు ఈవో జే. భవానీశంకర్ తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవం (నృసింహ ఆవిర్భావం) వేడుక వైభవంగా నిర్వహించేందుకు దివ్యక్షేత్రంలో ఏర్పాట్లు చేశామని స్వామివారి గిరిప్రదక్షిణ శుక్రవారం నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని ఈవోతెలిపారు.
సంగీత సభలు
స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు ధార్మిక సాహిత్య సంగీత సభలు, భజనలు, భక్తీసంగీత, శాస్త్రీయ నృత్యాలు కళాతోరణంలో కోలాహలం నెలకొంది. శ్రీరామ భక్త భజన మండలి(మల్లాపురం), శ్రీ గాయత్రి మహిళ భజన మండలి(యాదగిరిగుట్ట) భజన కార్యక్రమాలు, సాయంత్రం దేవులపల్లి నాగశ్రీదేవి భక్తీసంగీతం, శాంకరీ నాట్యస్థల్(హైదరాబాద్), మయూరి నాట్య కళాక్షేత్రం కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి.