ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన లోకాయుక్త
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:35 AM
ఆంధ్రజ్యోతి’లో జూన్ 24న ప్రచురితమైన రెండు కథనాలను తెలంగాణ లోకాయుక్త సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
సిద్దిపేట జిల్లాలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య..మృతుల పేర్లపై పెన్షన్ల చెల్లింపు వ్యవహారాలపై విచారణ
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’లో జూన్ 24న ప్రచురితమైన రెండు కథనాలను తెలంగాణ లోకాయుక్త సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ‘సిద్దిపేట జిల్లా మహ్మదాపూర్‌లో అభివృద్ధి పనుల బిల్లులు రాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య’తో పాటు ‘మరణించిన వారికి పెన్షన్లు.. లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియలో వెలుగుచూసిన వాస్తవాలు’ శీర్షికలతో వచ్చిన కథనాలపై తెలంగాణ లోకాయుక్త చట్టం-1983 ప్రకారం కేసులు నమోదు చేసింది. మాజీ సర్పంచ్ ఆత్మహత్య వ్యవహారంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, హుస్నాబాద్ మండల పంచాయతీ అధికారికి నోటీసులు జారీ చేసింది. అలాగే మృతుల పేర్లపై పెన్షన్ల చెల్లింపు అంశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో పాటు సెర్ప్ ముఖ్య కార్యనిర్వాహక అధికారికి నోటీసులు పంపింది. ఈ రెండు కేసులకు సంబంధించిన పూర్తి నివేదికలతో జూలై 21న వ్యక్తిగతంగా హాజరుకావాలని సంబంధిత అధికారులను లోకాయుక్త ఆదేశించింది. ఈ వ్యవహారాల్లో పరిపాలనా నిర్లక్ష్యం, అక్రమాలు, బాధ్యుల పాత్రపై లోకాయుక్త చట్టం-1984 ప్రకారం సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.