Share News

లోక్‌సభ స్థానాల పెంపుపై మోదీ సర్కారు ‘బుల్డోజింగ్‌’ యత్నం

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:48 AM

ఏ లెక్క ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం ఏ లెక్కన పెంచుతారని మోదీ ప్రభుత్వాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు.

లోక్‌సభ స్థానాల పెంపుపై మోదీ సర్కారు ‘బుల్డోజింగ్‌’ యత్నం

  • ఏ లెక్కన 50 శాతం చొప్పున పెంచుతారు..?

  • ఇది దక్షిణాదికి నష్టం చేయడమే

  • ఆ ముప్పుపై ముందే హెచ్చరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఏ లెక్క ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం ఏ లెక్కన పెంచుతారని మోదీ ప్రభుత్వాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. ‘ఇది ముమ్మాటికీ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేయడమే. రాబోయే ముప్పు గురించి ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు’ అని బుధవారం ఎక్స్‌ వేదికగా గుర్తు చేశారు. ‘లోక్‌సభ పరిమాణాన్నీ ప్రతి రాష్ర్టానికీ కేటాయించిన సీట్ల సంఖ్యనూ 50 శాతం పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక బిల్లును ‘బుల్‌డోజ్‌’ (బలవంతంగా రుద్దడం) చేయాలని ప్రతిపాదిస్తోంది. ఇటువంటి చర్య దక్షిణాదితోపాటు ఈశాన్య, పశ్చిమ భారత్‌లోని చిన్న రాష్ట్రాలకు ‘ప్రతికూలంగా’ మారుతుంది. ఈ విషయమై విపక్షాల ఆందోళనకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అన్ని రాష్ర్టాల్లో 50 శాతం సీట్లు పెంచడం సమానమనే వాదన మోస పూరితం. దీనివల్ల ప్రస్తుతానికి నిష్పత్తులు మారకపోవచ్చు కానీ, భవిష్యత్తులో విస్మరించలేని లోతైన పరిణామాలు ఉంటాయి. ఉదాహరణకు, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రస్తుత 80 సీట్ల నుంచి 120కి పెరుగుతాయి. కానీ తమిళనాడు ఎంపీల బలం 39 సీట్ల నుంచి 59కే పరిమితమవుతుంది. కేరళ లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే బీహార్‌ సీట్లు 40 నుంచి 60కి పెరుగుతాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం 66 సీట్లు పెరిగితే, ఉత్తరాది రాష్ర్టాలు ఏకంగా 200 సీట్లు పెంచుకుంటాయి’ అని జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన అధికారికంగా బహిర్గతమైతే ఇతరులూ ఆయన్నే అనుసరిస్తారు.’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 02:48 AM